‘ఉపాధి’తో శాశ్వత ఆస్తులు

14 Jan, 2021 04:52 IST|Sakshi

కూలీలకు పనులు కల్పిస్తూనే శాశ్వత ఆస్తుల కల్పన 

ఈ ఏడాది ఇప్పటికే  22.11 కోట్ల పని దినాలు  

కూలీ రూపంలో రూ.5,084 కోట్లు చెల్లింపు 

గత ఐదేళ్లలో ఎప్పుడూ 20 కోట్లు దాటని పనిదినాలు  

లాక్‌డౌన్‌.. వలస కూలీల రాకతో 6.27 లక్షల మందికి కొత్తగా జాబ్‌ కార్డులు  

సాక్షి, అమరావతి:  రికార్డు స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఉపాధి పథకం ద్వారా పనులు కల్పించింది. స్థానిక ప్రజలకు శాశ్వత అవసరాలకు ఉపయోగపడేలా ఆస్తుల కల్పన దిశగా పేదలకు పనులు కల్పింస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 515 గ్రామాల్లో కొత్తగా ఆట స్థలాలను తయారు చేశారు. మరో 461 గ్రామాల్లో పార్కులు ఏర్పాటు చేశారు. 6,396 ప్రాంతాల్లో మట్టి రోడ్లు.. 5,007 చోట్ల అంతర్గత రోడ్డు పనులు చేశారు. చిన్నా, పెద్ద తరహా ఆస్తులతో కలిపి దాదాపు ఐదు లక్షల వరకు ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పనులు చేపట్టారు.

గత ఏడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్య 275 రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 77,70,594 మంది కూలీలకు 22,10,99,729 పని దినాలు కల్పించారు. ఈ పథకం ద్వారా పనులు చేసుకోవడం ద్వారా 46.71 లక్షల కుటుంబాలు రూ.5,084 కోట్ల మేర వేతనాల రూపంలో లబ్ధి పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఈ స్థాయిలో ఎప్పుడూ పనులు కల్పించలేదని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పెద్ద ఎత్తున పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వచి్చన 3,85,625 కుటుంబాలకు చెందిన 6,27,989 మందికి పనులు కల్పించడానికి వీలుగా కొత్తగా జాబ్‌ కార్డులు మంజూరు చేశారు.   

మరిన్ని వార్తలు