ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి మచ్చుతునక.. మల్లెమడుగు రిజర్వాయర్‌

30 Nov, 2021 13:00 IST|Sakshi

రాష్ట్రంలో సైఫన్ల సాయంతో పనిచేస్తున్న ఏకైక రిజర్వాయర్‌

ఆనకట్ట దెబ్బతినకుండా అధికంగా వచ్చిన వరద నీరు దిగువకు..

960లోనే 47 సైఫన్లు అమరిక

వాటంతటవే రోలర్లు మాదిరిగా తిరుగుతూ వరద నీటిని వదిలేస్తున్న సైఫన్లు

61 ఏళ్లు గడిచినా చెక్కుచెదరని వైనం

చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోని మల్లెమడుగు రిజర్వాయర్‌ ఘనత ఇది 

సాక్షి, తిరుపతి అర్బన్‌ (చిత్తూరు జిల్లా): రాయలసీమలో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, ప్రాజెక్టులకు గండ్లు పడి తీవ్రనష్టం వాటిల్లుతోంది. ఇదే సమయంలో చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో ఉన్న మల్లెమడుగు రిజర్వాయర్‌కు మాత్రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. వచ్చిన వరదను వచ్చినట్టుగా సులువుగా దిగువకు విడిచిపెట్టేశారు. అలాగే వరదకు కొట్టుకొచ్చిన పెద్ద పెద్ద వృక్షాలను సైతం అవలీలగా కిందకు పంపేశారు. దీనికి కారణం.. మల్లెమడుగు రిజర్వాయర్‌ను సైఫన్‌లతో నిర్మించడమే. సైఫన్‌ల వల్లే ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలను, దానికి తగ్గట్టే వస్తున్న వరద నీరును రిజర్వాయర్‌ 
తట్టుకుంటోంది. 

61 ఏళ్లు గడిచినా చెక్కు చెదరలేదు..  
చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం ఎస్వీపురం, కరకంబాడి పంచాయతీల్లో  2,230 ఎకరాల విస్తీర్ణంలో మల్లెమడుగు రిజర్వాయర్‌ను ఏర్పాటు చేశారు. దీని నీటి నిల్వ సామర్థ్యం 0.181 టీఎంసీలు. 1960లో 47 సైఫన్లు అమర్చారు. ఇవి 61 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం విశేషం. రాష్ట్రంలో కేవలం మల్లెమడుగు రిజర్వాయర్‌కు మాత్రమే ఈ సైఫన్లు ఉన్నాయి. మొత్తం 21 అడుగుల లోతు కలిగిన ఈ రిజర్వాయర్‌లో 14 అడుగుల్లో నీటిని నిల్వ చేస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లకు సైఫన్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తే వరదలతో ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. 
చదవండి: ఏపీలో పేదల ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం

సైఫన్లు అంటే.. 
సిమెంట్, కాంక్రీట్‌లతో తయారుచేసిన రోలర్లులాంటివి.. ఈ సైఫన్లు. మొత్తం 47 సైఫన్లు ఉన్నాయి. ఒక్కోదాన్ని 20–25 అడుగుల ఎత్తు, 5 – 7 అడుగుల వెడల్పుతో నిర్మించారు. రిజర్వాయర్‌లో 14 అడుగుల్లో నీటిని నిల్వ చేయడానికి అవకాశం ఉంది. 14 అడుగులకు మించి ఒక్క అడుగు నీరు వస్తే 28 సైఫన్లు వాటంతటవే ఓపెన్‌ అవుతాయి. రోలర్‌ మాదిరిగా తిరుగుతూ వచ్చిన నీటిని వచ్చినట్టు సైక్లింగ్‌ చేస్తూ దిగువకు వదిలేస్తాయి. 14 అడుగులకంటే మరో రెండు అడుగుల నీరు అధికంగా వస్తే 28 సైఫన్లతోపాటు 12 ఓపెన్‌ అవుతాయి.
చదవండి: తక్షణ వరద సాయం కింద రూ.1,000 కోట్లు ఇవ్వండి: విజయసాయిరెడ్డి

14 అడుగుల కంటే మూడు అడుగులపైన నీరు వస్తే ఇంకో 7 ఓపెన్‌ అవుతాయి. అధికంగా వచ్చిన నీటిని పంపేయగా యథావిధిగా 14 అడుగుల నీటిని రిజర్వాయర్‌లో నిల్వ చేస్తాయి. ఇందుకు మానవ వనరుల అవసరం ఏమీ ఉండదు. ఇవికాకుండా మరో 17 ఇనుప గేట్లు ఉన్నా వాటి అవసరం ఎప్పుడూ రాలేదు. ఈ సైఫన్ల పనితీరును చూసిన ఇంజనీర్లు అప్పటి ఇంజనీర్ల పనితీరును ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. 

పుణ్యజలం.. మల్లెమడుగు 
మల్లెమడుగు నీటిని స్థానికులు పుణ్యజలంగా భావిస్తుంటారు. తిరుమల కొండల్లోని గోగర్భం, పాపవినాశనం, కుమారధార, పసుపుధార, ఆకాశగంగ.. ఇలా పంచ జలాశయాల నుంచి వచ్చే నీరు మల్లెమడుగు రిజర్వాయర్‌లోకి చేరుతోంది. ప్రస్తుతం రేణిగుంట, ఏర్పేడు మండలాల్లోని 14 చెరువులకు ఈ రిజర్వాయర్‌ నీటిని పంపుతున్నారు. దీంతో 3,950 ఎకరాల భూములు సాగులోకి వచ్చాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మల్లెమడుగు రిజర్వాయర్‌ ద్వారా 10 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించడానికి కృషి చేస్తోంది. 

మరిన్ని వార్తలు