ఏపీలో బాగా తగ్గిన క్రైమ్‌ రేటు

31 Oct, 2020 03:49 IST|Sakshi

సత్ఫలితాలనిస్తున్న వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చర్యలు.. రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన నేరాలు 

గత ఏడాదితో పోల్చుకుంటే 18% తగ్గుదల 

జాతీయ స్థాయి కంటే తక్కువగా ఏపీలో క్రైమ్‌ రేటు 

ఎన్సీఆర్‌బీ గణాంకాల స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నేరాలు తగ్గుతున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల అదుపునకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గత ఏడాదితో పోలి్చతే ఈ ఏడాది రాష్ట్రంలో నేరాలు ఏకంగా 18 శాతం తగ్గడం గమనార్హం. తీవ్రమైన నేరాలతో పాటు మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు కూడా తగ్గుముఖం పట్టాయి. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్‌బీ), ఏపీ పోలీస్‌ రికార్డుల్లో గణాంకాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎన్సీఆర్‌బీ 2019 లెక్కల ప్రకారం ప్రతి లక్ష మంది జనాభాకు జాతీయ స్థాయి క్రైమ్‌ రేటు 241.9 ఉంటే ఏపీలో అది 227.9 మాత్రమే ఉండటం గమనార్హం. అంటే జాతీయ స్థాయి కంటే ఏపీలో క్రైమ్‌ రేటు 14 తక్కువగా నమోదైందన్న మాట. అలాగే గతేడాదితో పోల్చితే ఈ ఏడాది రాష్ట్రంలో నేరాల సంఖ్య 18 శాతం తగ్గడం విశేషం. 

దేశానికే ఆదర్శంగా దిశ బిల్లు 
► పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో దిశ ఘటన నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకంటే ఎంతో ముందుగా స్పందించిన ఏపీ ప్రభుత్వం దిశ చట్టం తెచ్చేలా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. దిశ బిల్లు తేవడంతోపాటు దిశ మొబైల్‌ అప్లికేషన్, దిశ పోలీస్‌ స్టేషన్లు, దిశ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు, ప్రత్యేక పోలీస్‌ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి మహిళలు, బాలికలపై నేరాలకు చెక్‌ పెట్టేందుకు, నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు గట్టి చర్యలు చేపట్టింది. జీరో ఎఫ్‌ఐఆర్‌తో బాధితులకు తక్షణం పోలీస్‌ సాయం అందేలా చేస్తున్నారు. మహిళలు, బాలికలపై చిన్న ఘటన జరిగినా యుద్ధప్రాతిపదికన స్పందించి తక్షణ చర్యలు చేపడుతున్నారు.  

► స్పందన, మహిళా మిత్ర, సైబర్‌ మిత్ర, మహిళా పోలీస్‌ వంటి కార్యక్రమాలతో తక్షణం స్పందిస్తున్న తీరు శాంతిభద్రతల రక్షణకు, నేరాల అదుపునకు దోహదం చేస్తోంది. 
► ప్రజలకు 87 పోలీసు సేవలు మరింత అందుబాటులోకి తెస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించిన పోలీస్‌ సేవా యాప్‌ విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. బాధితులే కాకుండా సాధారణ పౌరులు సైతం పోలీస్‌స్టేషన్‌ గడప తొక్కనవసరం లేకుండానే మొబైల్‌ యాప్‌ ద్వారా పోలీస్‌ సేవలు పొందుతున్నారు.  
► ఇసుక, మద్యం అక్రమాలు, సంబంధిత నేరాలకు చెక్‌ పెట్టేలా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) ఏర్పాటు చేశారు.  
► పరివర్తన, నవోదయం వంటి కార్యక్రమాలతో నాటుసారా తయారీదార్లలో మార్పు కోసం పోలీసు యంత్రాంగం ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. 

నేరాలు మరింత తగ్గించేందుకు కృషి..
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల అదుపునకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. సీఎం దిశా నిర్దేశంలో రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగం ఉత్సాహంగా పనిచేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రజా సహకారాన్ని అందిపుచ్చుకుని చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇవ్వడంతో క్రైమ్‌ రేటు తగ్గింది. ఏపీ పోలీస్‌ శాఖకు ఈ ఏడాది ఏకంగా 103 జాతీయ అవార్డులు రావడం మా పనితీరును స్పష్టం చేస్తోంది. భవిష్యత్తులో మరింత ఉత్సాహం, జవాబుదారీతనంతో నేరాలు తగ్గించేందుకు కృషి చేస్తాం.  
– డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు