ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు

13 Sep, 2022 22:52 IST|Sakshi

సాక్షి, అమరావతి/ కాకినాడ: కొందరు వ్యక్తులు తాము సబ్ కాంట్రాక్ట్‌లు పొందినట్లు చెప్పుకుంటూ.. జిల్లాల వారీగా అక్రమ విక్రయాలను నిర్వహిస్తున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని, క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని వివిధ జిల్లాలకు చెందిన ఎస్పీలు హెచ‍్చరిస్తూ ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలను నిర్వహించేందుకు మెస్సర్స్ జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (జేపీవీఎల్) టెండర్ల ద్వారా అనుమతి పొందిందినట్లు చెప్పారు కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్‌ బాబు.

‘జేపీవీఎల్ వారు అనుమతించిన వ్యక్తులకు మాత్రమే రాష్ట్రంలో ఇసుక విక్రయాలను నిర్వహించేందుకు అనుమతి ఉంది. ఇతరులు ఎవరైనా తాము ఇసుక సబ్ కాంట్రాక్టర్, లేదా ఇతర పేర్లతో ఎటువంటి ఇసుక లావాదేవీలు జరిపినా చట్టపరంగా క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. అక్రమార్కులు ఎవరైనా తాము ఇసుక సబ్ కాంట్రాక్టర్, లేదా వివధ పేర్లతో కాకినాడ జిల్లా పరిధిలో ఎటువంటి ఇసుక లావాదేవీలు జరిపినా చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తాం.’ అని గట్టి హెచ్చరికలు జారి చేశారు.

అక్రమ రవాణా అడ్డుకట్టకు ఎస్‌ఈబీ ఏర్పాటు.. 
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను నెలకొల్పడం జరిగిందన్నారు ఎస్పీ. ఎస్.ఇ.బి అధికారులు జిల్లాలో నిత్యం వాహన తనిఖీలు చెక్ పోస్టుల వద్ద నిర్వహిస్తూ ఇసుక అక్రమ రవాణాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు, అక్రమ రవాణా నిర్మూలన కొరకు SEB అధికారులు టోల్ ఫ్రీ నెంబర్ 14500 ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఎవరైనా అక్రమ రవాణా సమాచారాన్ని నిర్భయంగా ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలియచేయవచ్చునని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ వెల్లడించారు.

ఖండించిన జేపీవీఎల్‌.. 
కొందరు వ్యక్తులు తాము సబ్ కాంట్రాక్ట్‌లు  పొందారని, జిల్లాల వారీగా విక్రయాలను నిర్వహిస్తున్నారంటూ వస్తున్న వార్తలను జేపీవీఎల్ పత్రికా ప్రకటన ద్వారా ఖండించింది. ‘కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎంటిసి ద్వారా నిర్వహింపచేసిన టెండర్లలో జయప్రకాశ్ పవర్ వెంచర్స లిమిటెడ్ (జేపీవీఎల్) ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక ఆపరేషన్స్‌ నిర్వహణను దక్కించుకుంది. టెండర్లలో మిగిలిన సంస్థలతో పోటీ పడుతూ జేపీవీఎల్ సాంకేతికంగానూ, ఆర్థికంగానూ తన సామర్థ్యంను చాటుకుని ఈ టెండర్లలో కాంట్రాక్ట్ పొందింది. టెండర్ నిబంధనల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన అన్ని నిబంధనలను జేపీవీఎల్ సంస్థ పాటిస్తోంది.

జేపీవీఎల్ సంస్థ విద్యుత్, కోల్ మైనింగ్ రంగాల్లో వ్యాపార అనుభవం కలిగిన సంస్థ. జేపీవీఎల్ సంస్థకు ఎటువంటి రాజకీయ పార్టీలతోనూ ఎలాంటి సంబంధాలు లేవు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా జేపీవీఎల్ సంస్థపై తప్పుడు అభిప్రాయం కలిగించేలా అసత్యాలతో కూడిన వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి అసత్య ప్రచారాలను, తప్పుడు వార్తలను జేపీవీఎల్ సంస్థ తీవ్రంగా ఖండిస్తోంది.’ అని పత్రిక ప్రకటన విడుదల చేశారు జేపీవీఎల్‌ సంస్థ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పంకజ్‌ గౌర్‌.

ఇదీ చదవండి: పారదర్శకంగా ఇసుక విధానం

మరిన్ని వార్తలు