సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ కొట్టేయండి

28 Oct, 2020 04:20 IST|Sakshi

హైకోర్టులో నారా లోకేష్‌ సన్నిహితుల క్రిమినల్‌ పిటిషన్లు

నేడు విచారణ జరపనున్న జస్టిస్‌ తేలప్రోలు రజనీ

వచ్చే నెల 5న పదవీ విరమణ చేయనున్న జస్టిస్‌ రజనీ 

సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని భూముల కుంభకోణం వ్యవహారంలో సీఐడీ ఇటీవల నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ టీడీపీ అధినేతలకు సన్నిహితులైన పలువురు తాజాగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తమ అరెస్టుతో పాటు సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని కోరుతూ వేర్వేరుగా క్రిమినల్‌ పిటిషన్లు దాఖలు చేశారు. వీరిలో నారా లోకేష్‌ స్నేహితుడు కిలారు రాజేశ్, ఆయన సతీమణి శ్రీహాస, నార్త్‌ఫేస్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లు తొట్టెంపూడి వెంకటేశ్వరరావు, చేకూరి తేజస్వి తదితరులు ఉన్నారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడమే తరువాయి, దర్యాప్తులపై హైకోర్టు స్టేలు ఇస్తుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ.. వీరంతా కూడా అదే అభ్యర్థనతో పిటిషన్లు దాఖలు చేయడం విశేషం.

పిటిషనర్లందరూ రాజధాని ఎక్కడ వస్తుందో అప్పటి ప్రభుత్వ పెద్దల ద్వారా ముందే తెలుసుకుని, అమరావతి చుట్టుపక్కల భూములు కొనుగోలు చేసి లబ్ధి పొందారని, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరుతూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన సలివేంద్ర సురేశ్‌ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ అధికారులు ఇటీవల పలువురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నిందితుల జాబితాలో కిలారు రాజేశ్‌ తదితరులు కూడా ఉన్నారు. ఇప్పుడు వీరు ఆ ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేత కోసం హైకోర్టును ఆశ్రయించారు.

ఈ వ్యాజ్యాలపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్‌ తేలప్రోలు రజనీ విచారణ జరపనున్నారు. ప్రస్తుతం హైకోర్టుకు దసరా సెలవులు నడుస్తున్నందున అత్యవసర కేసులను విచారించే వెకేషన్‌ కోర్టు జడ్జిగా జస్టిస్‌ రజనీ వ్యవహరిస్తున్నారు. హైకోర్టు విడుదల చేసిన సర్కులర్‌ ప్రకారం కేవలం బెయిల్స్, ముందస్తు బెయిల్స్‌ వంటి కేసులను మాత్రమే విచారించాల్సి ఉంది. అయినప్పటికీ కిలారు రాజేశ్‌ తదితరులు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్లపై కూడా హైకోర్టు విచారణ జరపనుండటం విశేషం. జస్టిస్‌ రజనీ వచ్చే నెల 5న పదవీ విరమణ చేయనున్నారు. పదవీ విరమణ అనంతరం కేంద్ర స్థాయిలో ఓ ట్రిబ్యునల్‌ పోస్టు కోసం ఆమె ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. కేంద్రం ఇంటెలిజెన్స్‌ వర్గాలు సైతం నిబంధనల ప్రకారం తమ విచారణను పూర్తి చేసి కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.  

మరిన్ని వార్తలు