చిన్నారులకు టీకాలే రక్ష

26 May, 2021 03:27 IST|Sakshi

పుట్టిననాటి నుంచి టీకాలు వేయించుకున్నవారికే.. క్రాస్‌ ఇమ్యూనిటీ

సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి అందరినీ బెంబేలెత్తిస్తోంది. దీంతో అందరూ శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకునేందుకు రకరకాల మందులూ, ఆహారం తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. చిన్నారులకు వ్యాధినిరోధక టీకాలే ఇప్పుడు పెద్ద శ్రీరామరక్షగా నిలుస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఓవైపు చిన్నారుల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, థర్డ్‌ వేవ్‌లో చిన్నారులకే ముప్పు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారిలో ‘క్రాస్‌ ఇమ్యూనిటీ’ అంశం తెరమీదకు వచ్చింది. పుట్టినప్పటి నుంచి క్రమం తప్పకుండా వ్యాధినిరోధక టీకాలు వేయడం వల్ల వచ్చే రోగనిరోధక శక్తినే క్రాస్‌ ఇమ్యూనిటీ అంటారు.  

వ్యాధినిరోధక టీకాలతో వైరస్‌కు చెక్‌.. 
పుట్టినప్పటి నుంచే చిన్నారులకు పోలియో మొదలుకొని బీసీజీ, డీపీటీ ఇలా అనేక రకాల వ్యాధినిరోధక టీకాలు వేస్తారు. ఈ టీకాలన్నిటితో చిన్నారుల్లో క్రాస్‌ ఇమ్యూనిటీ వస్తుందని శాస్త్రపరంగా నిర్ధారణ అయ్యిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్రాస్‌ ఇమ్యూనిటీ.. చాలావరకు కరోనాను నియంత్రించగలదని అంటున్నారు. ఐదేళ్ల వయసొచ్చేవరకూ ఈ టీకాలన్నీ ఎప్పటికప్పుడు వేయించుకున్న చిన్నారులకు కరోనా సోకడం తక్కువని, ఒకవేళ సోకినా ప్రాణభయం ఉండదని చిన్నపిల్లల వ్యాధుల వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా సమయంలో టీకా ఎందుకులే అని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వ్యాక్సిన్‌ వేయించాలని సూచిస్తున్నారు. కరోనా థర్డ్‌ వేవ్‌ చిన్నారుల్లో ఎక్కువ అనేది అపోహ మాత్రమేనని అంటున్నారు. అలాంటి నివేదికలేమీ ఇప్పటివరకూ రాలేదని, అయితే చిన్నారులు కూడా కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.

తల్లిదండ్రులు రొటీన్‌ టీకాలు తప్పనిసరిగా వేయించాలి..
చిన్నారులకు ఇచ్చే వ్యాధినిరోధక టీకాల వల్ల వారిలో క్రాస్‌ ఇమ్యూనిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా టీకాలు వేయిస్తే కరోనా వచ్చే ప్రమాదం తక్కువ ఉంటుంది. ఈ క్రాస్‌ ఇమ్యూనిటీ అనేది చిన్నారులకు 10 ఏళ్ల వయసొచ్చే వరకూ కాపాడుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు రొటీన్‌ టీకాలు తప్పనిసరిగా వేయించాలి.
–డా.కిరీటి, పీడియాట్రిక్‌ ప్రొఫెసర్, ఎస్వీ మెడికల్‌ కాలేజీ, తిరుపతి

మరిన్ని వార్తలు