ఆధారాల చోరీ ఘటనలో ఇద్దరు అదుపులోకి!?

16 Apr, 2022 11:03 IST|Sakshi
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ

సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల గుర్తింపు

నిందితులు పాత నేరస్తులే

వారి నుంచి చోరీసొత్తు స్వాధీనం?

నెల్లూరు (క్రైమ్‌): నెల్లూరు కోర్టులో ఆధారాల అపహరణ కేసుకు సంబంధించిన దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  కోర్టులో చోరీ జరగడం, అదీ ఓ కీలక కేసుకు సంబంధించిన ఆధారాలు దొం గిలించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. రాజకీయరంగు పులుముకున్న ఈ కేసును ఛేదించేం దుకు జిల్లా ఎస్పీ సీహెచ్‌ విజయారావు రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో కేసును విచారిస్తున్నారు. కోర్టు ప్రాంగణాన్ని శుక్రవారం పరిశీలించి కీలకపత్రాలు ఎక్కడున్నాయి? ఎక్కడ నుంచి దొంగిలించారు? తదితర వివరాలను ఆరా తీశారు. 

వివరాలివీ.. 2016 డిసెంబర్‌లో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ నేత, ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డితోపాటు మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నెల్లూరు 4వ అదనపు ఫస్ట్‌క్లాస్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో విచారణ సాగింది. అనంతరం విజయవాడలో ప్రజాప్రతినిధుల స్పెషల్‌ కోర్టులో  సాగుతోంది. అయితే, కేసు కు సంబంధించిన కీలక ఆధారాలు ల్యాప్‌టాప్, ట్యాబ్, సెల్‌ఫోన్లు, నకిలీపత్రాలు, రబ్బర్‌స్టాంపులు తదితరాలన్నీ నెల్లూరు కోర్టులోనే ఉన్నాయి. 

తాళాలు పగులగొట్టి దొంగతనం
బుధవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కోర్టు ప్రాంగణంలోకి వెళ్లి తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డారు. బీరువాలో ఉంచిన కీలక ఆధారాలున్న బ్యాగ్‌ను తస్కరించారు. బ్యాగ్‌తోపాటు కాగితాలను కోర్టు బయటపడేసి అందులో ఉన్న ట్యాబ్, ల్యాప్‌ టాప్, నాలుగు సెల్‌ఫోన్లు, నకిలీ పత్రాలు, రబ్బర్‌ స్టాంప్‌లను అపహరించుకు వెళ్లారు. దీంతో కోర్టు బెంచ్‌క్లర్క్‌ వి.నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు.

నగర ఇన్‌చార్జ్‌ డీఎస్పీ వై. హరినా«థ్‌రెడ్డి నేతృత్వంలో చిన్నబజారు ఇన్‌స్పెక్టర్‌ వీరేంద్రబాబు దర్యాప్తు ప్రా రంభించారు. కోర్టు ఆవరణలో సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తు క్లిష్టతరంగా మారింది. దీంతో కోర్టుకు వచ్చే రహదారులన్నింటిలోని సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో.. గురువారం తెల్లవారుజామున రెండుగంటల ప్రాం తంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వెళ్లడాన్ని గుర్తించారు.

వారు ఖుద్దూస్‌నగర్‌కు చెందిన పాత నేరస్తుడు, పొర్లుకట్టకు చెందిన అతని స్నేహితుడని తేలడంతో వారిద్దర్నీ అదుపులోకి తీసుకుని విచారించి..చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. రెండునెలల కిందట ఓ వృద్ధురాలిని కట్టేసి నగలు దొంగలించిన ఘటనలో పోలీసులు వీరిని అరెస్టు చేశారనీ, పదిరోజుల కిందటే వారు బయటకు వచ్చారని సమాచారం.

మరిన్ని వార్తలు