కృష్ణా బోర్డు పరిధిలోకి ‘వెలిగొండ’ను తేవాలి 

1 Sep, 2021 03:40 IST|Sakshi

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి 

ఈ ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రం చేపట్టిందే 

దీని పూర్తికి విభజన చట్టం అనుమతిచ్చింది 

కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శికి సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ లేఖ  

సాక్షి, అమరావతి : ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టును కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కృష్ణా బోర్డు పరిధిని ఖరారుచేస్తూ జూలై 15న జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో ఈ ప్రాజెక్టును చేర్చాలని కోరింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ మంగళవారం లేఖ రాశారు. 

లేఖలోని ప్రధానాంశాలివీ.. 
► శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 43.5 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి దుర్భిక్ష ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లా్లల్లో 4.47 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా వెలిగొండ ప్రాజెక్టును 2004లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 
► రాష్ట్ర విభజన నేపథ్యంలో.. నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తిచేయడానికి కేంద్రం అనుమతిచ్చింది. ఈ మేరకు విభజన చట్టంలో 11వ షెడ్యూలులో ఈ ప్రాజెక్టును చేర్చింది. 
► కృష్ణా బోర్డు పరిధిని ఖరారుచేస్తూ జూలై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో వెలిగొండ ప్రాజెక్టును చేర్చలేదు. 
► విభజన చట్టం ఆమోదించిన ఈ ప్రాజెక్టును తక్షణమే గెజిట్‌ నోటిఫికేషన్‌లో చేర్చేలా చర్యలు తీసుకోవాలి.  

మరిన్ని వార్తలు