ఫిషింగ్‌ హార్బర్ల పనులు వేగంగా పూర్తిచేయండి

27 Jul, 2021 04:30 IST|Sakshi

ఎగ్జిక్యూటింగ్‌ ఏజెన్సీలు, అధికారులకు సీఎస్‌ ఆదేశం

సాక్షి, అమరావతి: ఆంధ్ర రాష్ట్రానికి  మంజూరైన ఫిషింగ్‌ హార్బర్ల  నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఆదేశించారు. నూతనంగా మంజూరైన ఫిషింగ్‌ హార్బర్లపై హైలెవల్‌ కమిటీ సమావేశం సోమవారం విజయవాడలోని సీఎస్‌ క్యాంపు కార్యాలయంలో సీఎస్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా మంజూరైన ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు. ఇప్పటికే మొదటిదశ కింద చేపట్టిన ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎగ్జిక్యూటింగ్‌ ఏజెన్సీల అధికారులను సీఎస్‌ ఆదేశించారు. అలాగే  ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే అప్పగించాలని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లకు సూచించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఇతర అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.  

ఏపీడీఆర్పీ పనులన్నీ పూర్తి చేయాలి  
ప్రపంచ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో రూ.1,773 కోట్ల అంచనాలతో  శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి జిల్లా వరకు చేపట్టిన ఏపీడీఆర్పీ ప్రాజెక్టు పనులను ఈ ఏడాది డిసెంబర్‌ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ డిజాస్టర్‌ రికవరీ ప్రాజెక్ట్‌ (ఏపీడీఆర్పీ) 4వ రాష్ట్రస్థాయి ప్రాజెక్టు స్టీరింగ్‌ కమిటీ సమావేశం సీఎస్‌ క్యాంపు కార్యాలయంలో  జరిగింది. వాస్తవానికి ఈ పనులన్నీ 2015–2020 మధ్య  పూర్తి చేయాల్సి ఉందని, అయితే కరోనా తదితర కారణాల వల్ల సకాలంలో పూర్తి కాలేదని తెలిపారు. దీంతో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ప్రపంచ బ్యాంకు ఈ ఏడాది వరకు గడువును పొడిగించిందని వివరించారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు