ఆర్థిక నేరాలకు పాల్పడే సంస్థలపై కఠిన చర్యలు

11 Sep, 2020 07:21 IST|Sakshi

సీఎస్‌ నీలం సాహ్ని ఆదేశం

సాక్షి, అమరావతి: ఆర్థిక నేరాలకు పాల్పడే సంస్థలపై నమోదైన కేసుల దర్యాప్తు సత్వరమే పూర్తి చేసి బాధితులకు న్యాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. 19వ స్టేట్‌ లెవల్‌ కో– ఆర్డినేషన్‌ కమిటీ వర్చువల్‌ సమావేశం సీఎస్‌ అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్‌ లో వారి కార్యాలయంలో గురువారం జరిగింది. తొలుత ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ మాట్లాడుతూ, 19వ స్టేట్‌ లెవల్‌ కో– ఆర్డినేషన్‌ కమిటీ ఉద్దేశాన్ని వివరించారు. అనంతరం సీఎస్‌ నీలం సాహ్ని మాట్లాడుతూ, ఈ ఏడాది జనవరి 29న జరిగిన 18వ స్టేట్‌ లెవల్‌ కో– ఆర్డినేషన్‌ కమిటీలో తీసుకున్న నిర్ణయాల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన పలు సంస్థలపై నమోదైన కేసుల వివరాలు ఏయే దశల్లో ఉన్నాయో ఆరా తీశారు. ప్రజల కష్టాన్ని దోచుకునే సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని, బాధితులకు తక్షణమే పరిష్కారం చూపాలని ఆదేశించారు. 

మోసాలకు పాల్పడక ముందే, చిట్‌ ఫండ్, ఫైనాన్స్‌ సంస్థలు ఆర్బీఐ నిబంధనలకు లోబడి ఉన్నాయా? సంస్థల కార్యకలాపాల నిర్వహణకు అనుమతులు ఉన్నాయా....లేదా? అనే విషయాలు గుర్తించాలన్నారు.
అగ్రిగోల్డ్, అక్షయ్‌ గోల్డ్, అభయ్‌ గోల్డ్, హీరా గ్రూప్, సహారా సహా పలు సంస్థలపై వివిధ కోర్టుల్లో ఉన్న కేసుల వివరాలను సీఎస్‌ కు సీఐడీ, పోలీస్‌ అధికారులు వివరించారు.
ఎక్కువ కేసులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి నగరాల్లో నమోదవుతున్నట్లు సీఎస్‌ దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. 
ఎక్కువ వడ్డీల పేరుతో ప్రజల కష్టాన్ని దోచుకుంటున్న ఆర్థిక సంస్థలపై నమోదైన కేసుల దర్యాప్తు సత్వరమే పూర్తి చేసి, బాధితులకు న్యాయమందించాలని సీఎస్‌ ఆదేశించారు. 
సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత, ఆర్బీఐ ఏపీ, తెలంగాణ రీజనల్‌ డైరెక్టర్‌ సుబ్రతా దాస్, సీఐడీ, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు