పథకాల అమలుపై దృష్టి పెట్టండి 

19 May, 2022 04:51 IST|Sakshi

ప్రభుత్వ కార్యదర్శులకు సీఎస్‌ సమీర్‌ శర్మ అదేశం

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు పూర్తిస్థాయిలో విజయవంతంగా అందేందుకు, వారికి మెరుగైన పాలన అందించేందుకు అన్ని శాఖల కార్యదర్శులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఆదేశించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో గల సీఎం సమావేశ మందిరంలో బుధవారం సీఎస్‌ అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. గత కార్యదర్శుల సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలు, సుస్థిరాభివృధ్ధి లక్ష్యాల సాధన, సైబర్‌ సెక్యూరిటీ, ఏపీ ఆన్‌లైన్‌ లీగల్‌ కేసుల పర్యవేక్షణ విధానం వంటి అంశాలపై సమీక్షించారు.   

కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి 
ఏపీ ఆన్‌లైన్‌ లీగల్‌ కేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఏపీ ఓఎల్‌సీఎంఎస్‌) చక్కటి విధానమని, న్యాయపరమైన కేసుల నిర్వహణకు సంబంధిత శాఖల్లోని లైజన్‌ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సమీర్‌శర్మ అదేశించారు. ఆయా శాఖల లైజన్‌ అధికారులు ప్రతిరోజు కోర్టుల్లో నమోదైన కేసులు, వాటికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో పరిశీలించి ఎప్పటికప్పుడు సంబంధిత శాఖ కార్యదర్శికి తెలియజేయడం, సకాలంలో కౌంటర్లు దాఖలు చేయడంతోపాటు కోర్టులకు వివరాలను అందించాలన్నారు.

ఇకపై ప్రతినెలా అడ్వకేట్‌ జనరల్‌తో కలిసి గవర్నమెంట్‌ ప్లీడర్లు సంబంధిత శాఖల కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి కేసులపై సమీక్షించాలని, తద్వారా ప్రభుత్వానికి సంబంధించి పెండింగ్‌ కేసులను తగ్గించేందుకు వీలుంటుందని సీఎస్‌ పేర్కొన్నారు. నీతిఆయోగ్‌ నిర్దేశించిన ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై అన్ని శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని అదేశించారు. 

మరిన్ని వార్తలు