నిత్యావసర ధరల పర్యవేక్షణకు ప్రత్యేక యాప్‌

9 Jun, 2022 04:38 IST|Sakshi

త్వరలో అందుబాటులోకి: సీఎస్‌

సాక్షి, అమరావతి: రైతు బజారులు, స్థానిక మార్కెట్లలో కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకుల ధరల పర్యవేక్షణకు త్వరలో ప్రత్యేక యాప్‌ అందుబాటులోకి రానుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌శర్మ చెప్పారు. ఆయన బుధవారం సచివాలయంలో ధరల స్థితిగతులపై అధికారులతో సమీక్షించారు. ఈ ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా సీఎంయాప్‌–సీపీఏ (కన్సూమర్‌ ప్రైస్‌ అప్లికేషన్‌) పేరిట ప్రత్యేక యాప్‌ను త్వరలో అందుబాటులోకి తేనున్నట్టు తెలిపారు.

మార్కెటింగ్, తూనికలు కొలతలు, విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ అధికారులు, రైతు బజారుల సీఈవో ఈ యాప్‌ను ఎప్పటికప్పుడు మానిటర్‌ చేస్తూ స్థానిక మార్కెట్లలో వివిధ సరుకుల ధరలు, రైతు బజారుల్లోని ధరలను విశ్లేషిస్తూ అందుకు సంబంధించిన డేటాను ఈ యాప్‌లో అందుబాటులో ఉంచుతారని వివరించారు. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న మాట్లాడుతూ 10 శాఖల అధికారులు ఈ యాప్‌ను మానిటర్‌ చేసేందుకు ప్రత్యేక లాగిన్‌ ఐడీలను ఇస్తామని చెప్పారు. ధరల పర్యవేక్షణకు ప్రత్యేక మాస్టర్‌ డ్యాష్‌ బోర్టును కూడా రూపొందించినట్లు తెలిపారు. 

విపత్తుల నిర్వహణకు యాప్‌ రూపొందించాలి
నైరుతి రుతుపవన కాలంలో తుపానులు, వరదలు వంటి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధమై ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ అధికారులను ఆదేశించారు. ఈ విపత్తుల సమాచారాన్ని సకాలంలో సంబంధిత శాఖల అధికారులు పొందేందుకు వీలుగా ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను ఆదేశించారు.

ఆయన బుధవారం సచివాలయంలో నైరుతి రుతుపవన సన్నాహక ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ నెల మొదటి రెండు వారాల్లో వర్షాలు తక్కువగా, చివరి రెండు వారాల్లో  పూర్తిస్థాయిలో పడతాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారని చెప్పారు. జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తదితరులు మాట్లాడారు.  

మరిన్ని వార్తలు