ప్రకృతి వ్యవసాయానికి ‘ఉపాధి’ బాసట 

12 Sep, 2020 07:26 IST|Sakshi
ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఒకే తోటలో సాగవుతున్న వివిధ రకాల పంటలు

ఉపాధి హామీ పథకం నిధులతో ఐదు వరుసల పంటల సాగు 

ఒకే నేలలో పండ్లు, కూరగాయలు, తీగ జాతి మొక్కల పెంపకానికి ప్రోత్సాహం 

జిల్లాలో తొలిదశలో 210 పంచాయతీల్లో అమలు 

జాబ్‌ కార్డు ఉన్న రైతులు అర్హులు 

సాక్షి, అమరావతి బ్యూరో: లక్షల రూపాయలు ఖర్చు చేసి ఎరువులు, పురుగులు మందులు వాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నేల స్వభావానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా  ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తక్కువ పెట్టుబడితో ఒకే వ్యవసాయ క్షేత్రంలో ఐదు వరుసల నమూనాలో పంటలు సాగు చేసే అవకాశాన్ని పరిచయం చేస్తోంది. రైతులను ఈ దిశగా వ్యవసాయం చేసేలా ప్రోత్సహించడానికి జాతీయ ఉపాధి హామీ నిధులతో వందశాతం సబ్సిడీ కల్పిస్తోంది.   

ఒకే నేలలో ఒకేసారి 5 రకాల పంటల సాగు.. 
ఐదు వరుసల ప్రకృతి వ్యవసాయం పద్ధతిని జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా), పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ విభాగం సంయుక్తంగా రైతులకు పాటించేలా ప్రోత్సహిస్తాయి. ఐదు వరుసల వ్యవసాయంలో రైతు ఒకే నేలలో ఐదు రకాలదాకా పంటలను ఒకేసారి సాగు చేస్తారు. ఇందులో పండ్ల మొక్కలు, కూరగాయలు, తీగ జాతి మొక్కలు నాటుతారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేయటం వల్ల ఖర్చు తగ్గుతుంది. 
పండ్ల మొక్కలు నాటిన మూడేళ్లకు పంట చేతికి వస్తుంది. ఆలోగా వాటి మధ్యలో అంతర పంటగా నాటిన కూరగాయలు, తీగజాతి మొక్కల పంట చేతికి వచ్చి రైతుకు ఆదాయ వనరుగా మారుతుంది. ఐదు వరుసలలో ఏదో ఒక పంట దిగుబడి బాగా వచ్చినా నష్టపోయే ప్రమాదం ఉండదు. భూసారం పెరుగుతుంది. మూడేళ్ల తర్వాత పండ్ల మొక్కలతో ఎలాగో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. పంట సాగుచేసిన నెల రోజుల నుంచి ఏడాది పొడవునా రైతుకు ఆదాయం లభిస్తుంది.  

జిల్లాలో  210 పంచాయతీల్లో అమలు 
ఐదు వరుసల ప్రకృతి వ్యవసాయం జిల్లాలో ఈ ఏడాది 210 గ్రామ పంచాయతీలలో అమలు చేయనున్నారు. ఉపాధి హామీ జాబ్‌ కార్డు కలిగి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. ఒక్కో రైతుకు కనిష్టంగా 0.25 ఎకరాల నుంచి గరిష్టంగా ఒక ఎకరం వరకు సాగు చేసుకొనే అవకాశం ఉంది. రైతు పొలం భూసార పరీక్ష, గుంతలు తవ్వటం, మొక్కల నాటడం, మూడేళ్ల వరకు వాటి సంరక్షణకు అయ్యే ఖర్చునంతా జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా ప్రభుత్వం భరిస్తుంది. రెండు వరుసలలో సాగు చేసే పండ్ల మొక్కలను డ్వామా అందజేస్తుంది. మామిడి, సపోటా, జామ, కొబ్బరి, నేరేడు, ఊసిరి, సీతాఫలం, రేగి, నిమ్మ వంటి మొక్కలు నాటుతారు. మిగిలిన మూడు వరుసలలో కంది, బొప్పాయి, కూరగాయలు, దుంపజాతి, తీగ జాతి మొక్కలు నాటుతారు. ఇలా ఒక్కో రైతుకు మూడేళ్లలో గరిష్టంగా రూ.2.21 లక్షల దాకా ప్రయోజనం కలుగుతుంది. తక్కువ పెట్టుబడితో, నష్టపోకుండా ఐదు వరుసల పంట సాగుకు ఉపాధి హామీ నిధులను ఇవ్వటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

రైతులకు ఎంతో మేలు  
పెట్టుబడిలేని ఐదు వరుసల ప్రకృతి వ్యవసాయం సాగును జాతీయ ఉపాధిహామీ పథకంలోకి తీసుకురావటం రైతులకు ఎంతో ప్రయోజనకరం. దీన్ని ఉపయోగించుకొని రైతులు నష్టపోకుండా, ఏడాది పొడవునా ఆదాయం పొందొచ్చు. పొలంలో భూసార పరీక్షలు మొదలు, గుంతలు తవ్వటం, మొక్కలు, వాటిని నాటుకోవటానికి, పరిరక్షణకు ఇలా వివిధ రూపాల్లో ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరవుతాయి. ఇది రైతులకు ఎంతో తోడ్పాటుగా ఉంటుంది. ఈ ఏడాది జిల్లాలో 210 గ్రామ పంచాయతీలలో అమలు చేయనున్నాం. 
 – గజ్జెల శ్రీనివాసరెడ్డి, పీడీ, డ్వామా, గుంటూరు  

మరిన్ని వార్తలు