హార్టికల్చర్‌ హబ్‌గా ఏపీ

30 Mar, 2022 04:53 IST|Sakshi

లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటల సాగు

టమాటా, ఉల్లికి కేంద్రాలుగా చిత్తూరు, కర్నూలు

‘కృష్ణా’లో జాతీయ నూనె గింజల ఉత్పత్తి కేంద్రం

గుంటూరు మిర్చికి, కర్నూలు బంగినపల్లికి డిమాండ్‌

మామిడి గుజ్జు పరిశ్రమలతో పెరుగుతున్న సాగు విస్తీర్ణం

ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరుగుతున్న ఉద్యాన పంటల సాగు

సాక్షి, మచిలీపట్నం: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలతో ఉద్యాన పంటల సాగులో ఏపీ ముందంజలో ఉంది. సర్కారు ప్రోత్సాహంతో ఏటా వీటి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. రెండేళ్లుగా ప్రతి జిల్లాలోనూ వెయ్యి నుంచి 2వేల హెక్టార్లలో కొత్తగా పంటలు వేస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల హెక్టార్లలో 138 రకాల పండ్లు, కూరగాయలు, పువ్వుల పంటలు సాగుచేస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పండ్లు, పూలకు మంచి డిమాండ్‌ ఉండటంతో విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. 

అరుదైన ఉత్పత్తులు ఇక్కడ ప్రత్యేకం
ఉద్యాన పంటల సాగులో మిర్చి అత్యధికం. అందులో గుంటూరు జిల్లాలో సాగయ్యే మిర్చికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ పండే మిర్చి దేశంలో ఎక్కడా సాగవ్వదని అధికారులు చెబుతున్నారు. అలాగే, నేల స్వభావంవల్లే రైతులు ఇక్కడ ఈ పంటను అత్యధికంగా సాగుచేస్తున్నారని చెప్పారు. అందుకే ఇక్కడ అత్యధికంగా మిర్చి యార్డులు ఏర్పాటుచేసుకున్నారు. ఇక రెండో స్థానంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది మామిడి. మొత్తం 52 రకాల మామిడి పంటలు రాష్ట్రంలో సాగవుతున్నాయి. ఇందులో కర్నూలు, కృష్ణా జిల్లాలో సాగయ్యే బంగినపల్లి ఎంతో ప్రత్యేకమైనవి కావడంతో వీటికి డిమాండ్‌ ఎక్కువ. అదే విధంగా చిత్తూరు జిల్లాలోని తోతాçపురి రకానికి కూడా. ఇక్కడ ఏటా మామిడి సాగు పెరుగుతుండటంతో చిత్తూరు జిల్లాలో పెద్దఎత్తున గుజ్జు పరిశ్రమలు ఏర్పాటుచేసి ఎగుమతి చేస్తున్నారు. 

టమాటా, ఉల్లికి కేరాఫ్‌ చిత్తూరు, కర్నూలు
ఇక టమాటా, ఉల్లి పంట ఉత్పత్తులకు నిలయం చిత్తూరు, కర్నూలు జిల్లాలు. ఇక్కడ ఈ రెండు పంటలు అధికంగా సాగుచేస్తున్నారు. టమాటా కోసం మదనపల్లిలో ప్రత్యేకంగా మార్కెట్‌ యార్డును ఏర్పాటుచేయగా.. కర్నూలులో అతిపెద్ద ఉల్లి మార్కెట్‌ యార్డు ఉంది. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌లలో ఈ రెండు ప్రధానమైనవిగా చెప్పుకుంటారు. ఈ రెండు మార్కెట్‌లే వీటి ధరలను నిర్ణయించడం విశేషం. ఇక్కడ నుంచే వీటిని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు. ఇకపోతే రాష్ట్రంలో మరో ప్రధానమైన ఉద్యాన పంట అరటి. వివిధ ప్రాంతాల్లో 17 రకాల అరటి పంటలు సాగుచేస్తున్నారు. అమృతపాణి, చక్కరకేళి, కర్పూరం రకాలకు ఎక్కువ డిమాండ్‌. వైఎస్సార్‌ కడప జిల్లా కోడూరులో అరటి పంటను అత్యధికంగా సాగుచేస్తున్నారు.

కొత్త రకాల సాగు..
రాయలసీమ జిల్లాల్లో కొత్తకొత్త రకాల పండ్ల తోటలు వేస్తున్నారు. వైఎస్సార్‌ కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో డ్రాగన్‌ ప్రూట్‌ పంటల సాగుచేస్తున్నారు. మొదట్లో ఎకరం, రెండెకరాల్లో ప్రారంభమైన ఈ పంటల సాగు ఏటా పెరుగుతూ వస్తోంది. ఈ మూడు జిల్లాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ పంటను సాగుచేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నట్లు ఉద్యాన శాఖాధికారులు చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో ఖర్జూరం, కర్నూలు జిల్లాలో ద్రాక్ష సాగు విస్తరిస్తోంది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆయిల్‌పామ్‌ సాగు పంటపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. దాంతో కృష్ణాజిల్లా హనుమాన్‌ జంక్షన్‌ అంపాపురం వద్ద నూనెగింజల ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేశారు. రెండు జిల్లాల నుంచి వచ్చే పంట ఉత్పత్తుల ద్వారా ప్రతిరోజూ 1.60 లక్షల టన్నుల ప్రొడక్షన్‌ ఉందని పరిశ్రమ నిర్వాహకులు వెల్లడించారు. మరోవైపు.. రాష్ట్రంలో జీడిపప్పు సాగు కూడా అనూహ్యంగా పెరుగుతోంది. కొబ్బరి తోటలూ అధికంగా ఉన్నాయి.  

ఉపాధి పథకంతో ఊతం
ఉద్యాన వనాలకు ‘ఉపాధి’ హామీ పథకం ఎంతగానో చేయూతనిస్తోంది. పండ్ల తోటల పెంపకానికి ఈ పథకం రైతులకు బాసటగా నిలుస్తోంది. మూడేళ్లపాటు వాటి సంరక్షణకు తోడ్పాటునిస్తోంది. తమ సొంత పొలాల్లో తాము కోరుకున్న పండ్ల తోటలు పెంచుకుంటూనే ‘ఉపాధి’ పొందే వెసులుబాటు కల్పిస్తుండడంతో రైతులు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. సొంత పొలంలో గుంతలు తీసి మొక్కలు నాటేందుకు అయ్యే ఖర్చుని ప్రభుత్వమే భరిస్తోంది. తోట పెంపకానికి ఎంతమంది ఉపాధి కూలీలు అవసరమవుతారో గుర్తించి, ఆ రైతుతో పాటు వారికి కూడా వేతనాలు చెల్లిస్తారు. తన తోటలో తాను పనిచేసుకుంటూ రోజుకు రూ.220కు పైగా వేతనం పొందే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది రైతులు తోటల పెంపకానికి మొగ్గు చూపుతున్నారు. ఒక్కో రైతుకు గరిష్టంగా కనీసం వంద రోజుల పనిదినాలు కల్పిస్తున్నారు. దాంతో రాష్ట్రంలో పండ్ల తోటల పెంపకంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. 

మరిన్ని వార్తలు