ముందస్తు ఏరువాకకు ఏర్పాట్లు 

23 May, 2022 04:08 IST|Sakshi

నాలుగు దశాబ్దాల తర్వాత ఉత్సాహంగా సన్నద్ధం.. ఖరీఫ్‌లో 95,23,217 ఎకరాల్లో సాగు లక్ష్యం 

జూన్‌ 1న గోదావరి డెల్టా, జూన్‌ 10న కృష్ణా డెల్టా, పెన్నా ప్రాజెక్టుకు నీరు.. జూన్‌ చివరి వారంలో శ్రీశైలం ప్రాజెక్టు కింద నీటి విడుదల 

సాక్షి, అమరావతి: దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ముందస్తు తొలకరికి అన్నదాతలు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నారు. సాగునీటి ప్రణాళికతో పాటు చానళ్ల వారీగా నీటి విడుదల షెడ్యూల్‌ ఖరారు కావడంతో అవకాశాన్ని అందిపుచ్చుకొని అదునులో విత్తుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకవైపు ఆర్బీకేల ద్వారా ప్రచారం చేస్తూ మరోవైపు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సీజన్‌కు ముందే అందుబాటులో ఉంచేలా వ్యవసాయశాఖ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. 

నాడు ముక్కారు పంటలు..
ఒకప్పుడు ముక్కారు పంటలు పండిన కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టా ప్రాంతాల్లో 2 పంటలు చేతికి రావడం గగనమైపోయింది. ఆంగ్లేయుల కాలం నుంచి ఏప్రిల్‌–మేలో నిలిపివేసి మే–జూన్‌లో కాలువలకు నీటిని విడుదల చేసేవారు. 1980కు ముందు వరకు ఇలాగే కొనసాగింది. ఆ తర్వాత పనుల్లో జాప్యం కారణంగా నీటి నిలిపివేత వ్యవధిని 2 నెలలకు పెంచడంతో పాటు మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. డెల్టాలో వరిసాగు ప్రశ్నార్థకంగా మారడంతో ఒకదశలో సాగు సమ్మెకు సైతం సిద్ధపడ్డారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి.

సమృద్ధిగా నీరు
మూడేళ్లుగా విస్తారంగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో రైతన్నలు ఏటా సిరుల పంట పండిస్తున్నారు. ప్రభుత్వం దాదాపు 4 దశాబ్దాల తర్వాత ముందస్తు సాగుకు సన్నాహాలు చేస్తోంది. 

అదనపు ఆదాయం.. భూమి సారవంతం
జూన్‌ మొదటి వారంలో ఖరీఫ్‌ పంటలను విత్తుకుంటే అక్టోబర్‌ చివరికి కోతలు పూర్తి కానున్నాయి. మార్చి చివరికల్లా రబీ ముగించుకొని మూడోపంటగా అపరాలు సాగు చేపట్టేలా రైతులను సిద్ధం చేయాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. తద్వారా అక్టోబర్‌–నవంబర్‌లో ఖరీఫ్‌ పంట, మేలో రబీ పంట వైపరీత్యాలు, తుపాన్ల బారిన పడకుండా కాపాడవచ్చు. మూడో పంటగా అపరాలు సాగు చేస్తే ఎకరాకు కనీసం రూ.30 వేలకు పైగా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. అపరాల కోతల తర్వాత దుక్కులు దున్నడం వల్ల భూమి సారవంతంగా మారుతుంది.

సీజన్‌కు ముందే ఎరువులు, విత్తనాలు
2022 ఖరీఫ్‌లో 95,23,217 ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించారు. సాధారణంగా ఈ సీజన్‌లో ఏప్రిల్‌–మేలో 2 లక్షల టన్నులు, జూన్‌–జూలైలో 3 లక్షల టన్నుల ఎరువులను కేంద్రం కేటాయిస్తుంది. ముందస్తు సాగు నేపథ్యంలో వీటిని రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం ఆమోదించడంతో సరిపడా నిల్వలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 5.8 లక్షల టన్నుల ఎరువులు సిద్ధంగా కాగా 1.50 లక్షల టన్నులను ఆర్బీకేల్లో నిల్వ చేస్తున్నారు.

జూన్‌–జూలైలో కనీసం 6 లక్షల టన్నులు సిద్ధం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సర్టిఫై చేసిన 6.52 లక్షల టన్నుల విత్తనాలను సిద్ధం చేయగా ఇప్పటికే వేరుశనగ విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. వరితో సహా మిగిలిన విత్తనాలను జూన్‌ 1 నుంచి ఆర్బీకేల ద్వారా పంపిణీకి సిద్ధంగా ఉంచారు. తొలిసారిగా వాణిజ్య పంటలైన పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తున్నారు. మొత్తం వినియోగంలో కనీసం 20–30 శాతం ఎరువులు, 5–10 శాతం పురుగుల మందులను ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

ఆర్బీకేల్లో విస్తృత ప్రచారం
గతంతో పోలిస్తే ఈసారి 15–30 రోజులు ముందుగా సాగు నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌ 1న గోదావరి డెల్టాకు, జూన్‌ 10న కృష్ణా డెల్టా, పెన్నా ప్రాజెక్టు కింద, జూన్‌ చివరి వారంలో శ్రీశైలం ప్రాజెక్టు కింద నీటి విడుదలకు ప్రణాళిక రూపొందించారు. అందుకనుగుణంగా నీటి పారుదల సలహా మండలి సమావేశాల్లో చానళ్ల వారీగా నీటి విడుదలను, వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాల్లో పంటల ప్రణాళికలను ఖరారు చేశారు. రైతులను సన్నద్ధం చేసేందుకు ఆర్బీకేల ద్వారా పోస్టర్లు, కరపత్రాలు, టముకు ద్వారా ప్రచారం చేస్తున్నారు.

పాలనకు ప్రకృతి సహకారం...
సీఎం వైఎస్‌ జగన్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టుల నిండా సమృద్ధిగా నీళ్లుండడంతో దశాబ్దాల తర్వాత రైతులకు ముందస్తుగా నీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అందుబాటులో ఉంచాం.
– కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి

ఏర్పాట్లు పూర్తి
ముందస్తు సాగుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సీజన్‌కు ముందుగానే ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచాం.
    – చేవూరు హరికిరణ్, స్పెషల్‌ కమిషనర్, వ్యవసాయ శాఖ 

మరిన్ని వార్తలు