Rabbi season‌: ఊపందుకున్న రబీ.. సాగు లక్ష్యం 60 లక్షల ఎకరాలు

26 Dec, 2021 10:24 IST|Sakshi

ఇప్పటివరకు 21.82 లక్షల ఎకరాలు సాగులోకి

14.07 లక్షల ఎకరాల్లో అపరాలు సాగు

బోర్ల కింద వరికి బదులు చిరుధాన్యాలు, అపరాలు

సాక్షి, అమరావతి: అకాల వర్షాలు, భారీ వరదలతో మొదలైన రబీ సీజన్‌ క్రమంగా ఊపందుకుంటోంది. మొత్తం సాగు లక్ష్యంలో ఇప్పటికి మూడో వంతు పూర్తయింది. రాయలసీమ జిల్లాల్లో పెద్దఎత్తున పంటలు దెబ్బతినడంతో ఇక్కడ రెండోసారి విత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 56.19 లక్షల ఎకరాలు కాగా.. 2018–19లో 53.04 లక్షలు, 2019–20లో 54.66 లక్షల ఎకరాల్లో సాగైంది.

చదవండి: నిండుగా తుంగభద్ర.. రికార్డు స్థాయిలో నీటి నిల్వలు

గతేడాది రెండో పంటకు నీరివ్వడం, వాతావరణం కలిసి రావడంతో 62 లక్షల ఎకరాల్లో సాగైంది. రబీ చరిత్రలో ఇదే రికార్డు. ప్రస్తుతం రబీలో 60 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించారు. గతేడాది ఇదే సమయానికి 124.45 లక్షల ఎకరాల్లో సాగవగా ఈ ఏడాది వర్షాలు, వరదల ప్రభావంతో ఇప్పటివరకు 21.82 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. గోదావరి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో రెండో పంటకు నీరిచ్చే పరిస్థితి లేకపోవడం, బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంతో గతేడాదితో పోలిస్తే వరి సాగు తగ్గనుండగా అపరాలు, చిరు ధాన్యాల విస్తీర్ణం పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.

వరి లక్ష్యం 21.50 లక్షల ఎకరాలు
రబీలో వరి సాధారణ విస్తీర్ణం 17.60 లక్షల ఎకరాలు కాగా.. 2019–20లో 19.38 లక్షల ఎకరాలు, 2020–21లో 23.49 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 21.50 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటివరకు 3.33 లక్షల ఎకరాల్లో సాగైంది. గతేడాది ఇదే సమయానికి 4.67లక్షల ఎకరాల్లో సాగవగా ఈ ఏడాది వర్షాలు, వరదలవల్ల నాట్లు మందకొడిగా సాగుతున్నాయి.

పెరగనున్న అపరాల సాగు
ఇక ముతక ధాన్యాలు 8.2 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 2.05 లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. 1.13 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 87వేల ఎకరాల్లో జొన్నలు సాగయ్యాయి. అపరాల సాగు లక్ష్యం ఈ ఏడాది 24.15 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 14.07 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 14.32 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. అలాగే, ఇప్పటివరకు 8.22 లక్షల ఎకరాల్లో కందులు, 4.77 లక్షల ఎకరాల్లో మినుములు, 60వేల ఎకరాల్లో పెసలు సాగయ్యాయి. నూనె గింజల సాగు లక్ష్యం 3.67 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 1.17లక్షల  ఎకరాల్లో సాగయ్యాయి. వేరుశనగ 95 వేల ఎకరాల్లో సాగైంది. పొగాకు సాగు లక్ష్యం 1.77 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 72 వేల ఎకరాల్లో సాగైంది. మిరప సాగు లక్ష్యం 75 వేల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 37 వేల ఎకరాల్లో సాగు చేపట్టారు.

రాయలసీమలో రికార్డు వర్షపాతం
సీజన్‌ ఆరంభంలోనే ఈసారి భారీ వర్షపాతం నమోదైంది. ఈశాన్య రుతు పవనాల సీజన్‌లో 24.3 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు 294 మి.మీ.ల వర్షపాతం కురవాల్సి ఉండగా, ఇప్పటివరకు 365.9 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. రాయలసీమ జిల్లాల్లో 235.7 మి.మీ.లు కురవాల్సి ఉండగా, 431.2 మి.మీ.ల వర్షపాతం (82.9 శాతం అధికం) కురిసింది. కోస్తాంధ్రలో 381.2 మి.మీ.ల వర్షపాతానికి 416.2 మి.మీ.ల వర్షపాతం (9.2 శాతం అధికం) కురవగా, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో 271.7 మి.మీ.ల వర్షపాతానికి 259.4 మి.మీ.ల వర్షపాతం (–4.5 శాతం తక్కువ) కురిసింది.

మళ్లీ నారు పోశాం
20 ఎకరాల్లో నెల్లూరు జీలకర్ర సన్నాలు రకం వరి నారుమడి వరదలకు కొట్టుకుపోయింది. 80 శాతం సబ్సిడీపై ప్రభుత్వం ఇచ్చిన విత్తనంతో మళ్లీ నారుమళ్లు పోసుకున్నా. నాట్లు వేయాలి ఇక.
– పి.విశ్వనాథ్, నెల్లూరు జిల్లా

బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలు
అకాల వర్షాలు, వరదలతో రబీ సీజన్‌ మొదలైంది. నారుమళ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో మళ్లీ పోసుకుంటున్నారు. బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేపట్టాలని ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈసారి అపరాలు, చిరుధాన్యాలను ప్రోత్సహిస్తున్నాం.
– కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి 

మరిన్ని వార్తలు