20 వరకు కర్ఫ్యూ పొడిగింపు

8 Jun, 2021 03:16 IST|Sakshi

జూన్‌ 11 నుంచి సడలింపు సమయం రెండు గంటలు పెంపు

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు కర్ఫ్యూ సడలింపు 

144 సెక్షన్‌ అమలు.. సడలింపు సమయంలో గుమికూడరాదు     

కేసులు తగ్గుతున్నా అప్రమత్తంగానే ఉండాలి.. అలసత్వం వద్దు 

కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో కర్ఫ్యూను ఈ నెల 20వతేదీ వరకు పొడిగిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌ తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొంత వెసులుబాటు కల్పిస్తూ శుక్రవారం నుంచి కర్ఫ్యూ సడలింపు సమయాన్ని అదనంగా రెండు గంటల పాటు పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ నెల 10వతేదీ వరకు కర్ఫ్యూ నిబంధనల ప్రకారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్‌తో సడలింపు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కోవిడ్‌ కేసులు కొంత తగ్గుముఖం పట్టినందున కర్ఫ్యూ సడలింపు సమయాన్ని రెండు గంటలు పెంచనున్నారు.


ఈ నెల 11 నుంచి ఇలా..
ఈ నెల 11వ తేదీ నుంచి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 144 సెక్షన్‌తో కర్ఫ్యూ సడలింపు వర్తిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలను తెరిచి ఉంచేందుకు అనుమతించనున్నారు. కర్ఫ్యూ సడలింపు సమయంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. ప్రజలు గుమికూడకుండా భౌతిక దూరం పాటిస్తూ కార్యకలాపాలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. కోవిడ్‌ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ అధికార యంత్రాంగంతో పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. పాజిటివిటీ రేటు తగ్గి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకూ అలసత్వం వహించకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు.  

మరిన్ని వార్తలు