పకడ్బందీగా కర్ఫ్యూ

6 May, 2021 04:49 IST|Sakshi
ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు వద్ద వాహనాన్ని తనిఖీ చేస్తున్న ఆంధ్రా అధికారులు

మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎక్కడివారు అక్కడే గప్‌చుప్‌

రోజూ 18 గంటలపాటు 18వ తేదీ వరకు కొనసాగింపు

ప్రజారోగ్యం కోసం ప్రభుత్వ నిర్ణయం

అనుమతిలేని వాహనాలకు రాష్ట్రంలోకి నో ఎంట్రీ

తెలంగాణ పోలీసుల అభ్యంతరంతో ఏపీ చెక్‌పోస్టు మార్పు

సాక్షి, అమరావతి/గరికపాడు/వత్సవాయి/చింతూరు: రాష్ట్రంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. రోజూ 18 గంటల చొప్పున ఈ నెల 18వ తేదీ వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే షాపులకు అనుమతి ఇచ్చారు. ప్రజలు నిత్యావసరాలకు ఆ సమయాన్ని వినియోగించుకున్నారు. పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకుల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలోనే రోడ్లపైకి వచ్చారు. అయితే కర్ఫ్యూ అమలులో లేని సమయంలో ఐపీసీ 144 సెక్షన్‌ అమలు చేస్తుండటంతో ఎక్కడా ఐదుగురికి మించి గుమిగూడి ఉండకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

కర్ఫ్యూ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు, రెస్టారెంట్లను మూసివేశారు. ప్రజా రవాణా సైతం నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సులతో పాటు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను నిలిపివేశారు. అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ వాహనాలను అనుమతించారు. ఆస్పత్రులు, వ్యాధి నిర్ధారణ చేసే ల్యాబ్‌లు, ఔషద దుకాణాలు తదితర అత్యవసర సేవలకు అనుమతి ఇచ్చారు. కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై విపత్తుల నిర్వహణ చట్టం–2005 సెక్షన్‌ 51 నుంచి 60, ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ అన్ని జిల్లాల్లోను కర్ఫ్యూ అమలు తీరును వర్చువల్‌ పద్ధతిలో పరిశీలించారు. జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్‌ కమిషనర్లు కర్ఫ్యూ అమలు తీరును స్వయంగా పర్యవేక్షించారు. కర్ఫ్యూ సమయంలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి తదితర ప్రధాన నగరాలతోపాటు గ్రామాల్లోని రోడ్లు సైతం నిర్మానుష్యంగా మారాయి. 

సరిహద్దుల్లోను ‘చెక్‌’పోస్టులు
ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన జగ్గయ్యపేట–కోదాడ, నాగార్జునసాగర్‌–మాచర్ల, పొందుగల–వాడపల్లి వద్ద చెక్‌పోస్టులతో రోడ్లను మూసివేశారు. వాహనాల రాకపోకలపైన ఆంక్షలు వి«ధించారు. అత్యవసరాలకు సంబంధించిన వాహనాలను మాత్రమే రాష్ట్ర పోలీసులు అనుమతించారు. విమాన, రైల్వే, బస్‌ టికెట్లు ఉన్నవారిని, ఆస్పత్రి ఇతర అత్యవసర పరిస్థితులు ఉన్నవారిని గుర్తింపు కార్డులను తనిఖీలు చేసి రాష్ట్రంలోకి అనుమతించారు. ఏపీ చెక్‌పోస్టు తమ భూ భాగంలో ఉందంటూ తెలంగాణ పోలీసులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఏపీకి చెందిన చెక్‌పోస్టును అక్కడి నుంచి తొలగించి జగ్గయ్యపేట వైపునకు కొత్తగా ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలోని జిల్లా సరిహద్దులోను, ప్రధాన నగరాల్లోను పోలీస్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నియంత్రించారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద మధ్యాహ్నం 12 గంటల తరువాత తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐలు వెంకటేశ్వరరావు, సోమేశ్వరరావు, మహాలకు‡్ష్మడు వెనక్కుతిప్పి పంపారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలానికి ఆనుకుని వున్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. చింతూరు మండలం చిడుమూరు వద్ద ఛత్తీస్‌గఢ్‌ నుంచి, కల్లేరు వద్ద ఒడిశా నుంచి మన రాష్ట్రంలోకి వాహనాలు ప్రవేశించకుండా తహశీల్దార్‌ కరక సత్యన్నారాయణ, ఎంపీడీవో వెంకట రత్నం, ఎస్‌ఐ సురేష్‌బాబు పర్యవేక్షించారు. 

>
మరిన్ని వార్తలు