విద్యుత్‌ సంస్థలు చట్టాన్ని అనుసరించాల్సిందే

21 Sep, 2021 05:19 IST|Sakshi

ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి 

సాక్షి, అమరావతి: విద్యుత్‌ పంపిణీ సంస్థలు చట్టం పరిధిలోనే పనిచేయాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్‌ జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి చెప్పారు. విద్యుత్‌ చట్టం–2003 సెక్షన్‌ 88 ప్రకారం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంతోపాటు వినియోగదారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పంపిణీ సంస్థలపై ఉందని గుర్తుచేశారు. వర్చువల్‌గా సోమవారం జరిగిన ఈ సమావేశంలో ఆయనతోపాటు ఏపీఈఆర్‌సీ సభ్యులు పి.రాజగోపాల్‌రెడ్డి, ఠాకూర్‌ రామసింగ్‌ హైదరాబాద్‌లోని కార్యాలయం నుంచి, సలహామండలిలోని 16 మంది సభ్యులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పాల్గొని పలు అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ వినియోగదారులకు అందించే సేవలను మెరుగుపరిచేందుకు పౌరసేవల ప్రమాణాలను (ఎస్‌వోపీని) సవరించినట్లు తెలిపారు. దీనివల్ల కొన్ని సేవల వైఫల్యంపై వినియోగదారుల ఫిర్యాదు మేరకు డిస్కంలు ఆటోమేటిక్‌గా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇంధన పొదుపు, సంరక్షణ కార్యక్రమాలను ప్రోత్సహించడంలో ఏపీఈఆర్‌సీ క్రియాశీల పాత్ర పోషిస్తోందన్నారు. డిస్కంలు సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటూ, వినియోగదారులకు సాధ్యమైనంత ఉత్తమంగా ప్రయోజనాలు అందించాలని ఆయన సూచించారు.

సేవా ఖర్చు తగ్గింపు, విద్యుత్‌ కొనుగోళ్ల క్రమబద్ధీకరణ, మెరుగుపరచడం, డిస్కంల పనితీరు, ప్రజల సమర్థమైన భాగస్వామ్యం, నియంత్రణ నిర్ణయ ప్రక్రియ, విద్యుత్‌ లైన్లు పంట చేలపై నుంచి వేయాల్సి వచ్చినపుడు రైతులకు పరిహారం చెల్లింపు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. సభ్యుల సూచనలపై చట్టం పరిధిలో చర్యలు తీసుకుంటామని చైర్మన్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు