ఏపీ, తెలంగాణపై.. ‘అప్పర్‌ భద్ర’ బండ!

10 Mar, 2021 03:58 IST|Sakshi

ఈ ప్రాజెక్టుకు డిసెంబర్‌ 24న సీడబ్ల్యూసీ టీఏసీ గ్రీన్‌సిగ్నల్‌ 

దీంతో తుంగ నుంచి 17.40 టీఎంసీలను భద్ర రిజర్వాయర్‌లోకి ఎత్తిపోత

భద్ర నుంచి 29.40 టీఎంసీలను ఎత్తిపోసి లక్షల ఎకరాలకు నీరు

దిగువనున్న తెలుగు రాష్ట్రాల అభిప్రాయం తీసుకోని సీడబ్ల్యూసీ

తుంగభద్ర బోర్డుకూ సమాచారం ఇవ్వని వైనం

సీడబ్ల్యూసీ ఏకపక్ష అనుమతిని తప్పుపడుతున్న నిపుణులు

సాక్షి, అమరావతి: అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఆర్‌డబ్ల్యూడీ)–1956 నిబంధనలకు విరుద్ధంగా.. పరీ వాహక ప్రాంతం (బేసిన్‌)లోని దిగువ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభిప్రాయాలను తీసుకోకుండా తుంగభద్ర నుంచి అప్పర్‌ భద్ర ప్రాజెక్టు ద్వారా 29.90 టీఎంసీలను తరలించడానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అనుమతివ్వడాన్ని నీటిపారుదలరంగ నిపుణులు తప్పుపడుతున్నారు. కనీసం కేంద్ర ప్రభుత్వ అధీకృత సంస్థ అయిన తుంగభద్ర బోర్డుకూ సమాచారం ఇవ్వకపోవడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. తుంగభద్ర సబ్‌ బేసిన్‌ (కే–8)లో కేటాయించిన 295 టీఎంసీల కంటే అధికంగా కర్ణాటక వినియోగిస్తోంది. తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన.. ఆ సబ్‌ బేసిన్‌లో 151.74 టీఎంసీలను ఆ రాష్ట్రం వినియోగించుకోవాల్సి ఉండగా.. 2000–01లో 176.96 టీఎంసీలు వాడుకుందని సాక్షాత్తూ కేడబ్ల్యూడీటీ (కృష్ణా నదీ జల వివాదాల ట్రిబ్యునల్‌)–2 స్పష్టంచేసింది. వీటిని పరిగణనలోకి తీసుకోకుండానే.. డిసెంబర్‌ 24న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమైన సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా మండలి (టీఏసీ) రూ.16,125.48 కోట్లతో అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు అనుమతిచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శనివారం జారీచేసింది. 

తెలుగు రాష్ట్రాలకు దెబ్బే
ఇప్పటికే తుంగభద్ర జలాశయానికి ఎగువన కర్ణాటక అధికంగా నీటిని వినియోగిస్తోంది. అప్పర్‌ భద్ర ప్రాజెక్టు పూర్తయితే, తుంగభద్ర జలాశయానికి వచ్చే వరద ప్రవాహం కనిష్ఠ స్థాయికి తగ్గుతుంది. దీనివల్ల తుంగభద్ర జలాశయం పరిధిలో రాయలసీమలో హెచ్చెల్సీ (ఎగువ కాలువ) కింద 1,90,035, ఎల్‌ఎల్‌సీ (దిగువ కాలువ), కేసీ (కర్నూల్‌–కడప) కాలువ కింద 2,65,628, ఆర్డీఎస్‌ (రాజోలిబండ డైవర్షన్‌ స్కీం) కింద 87,500 వెరసి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు తుంగభద్ర జలాశయానికి వరద వచ్చే అవకాశమే ఉండదు. అప్పుడు సాగునీటి మాట దేవుడెరుగు.. రాయలసీమ జిల్లాల్లో తాగునీటికీ ఇబ్బందులు పడాల్సి వస్తుందని నీటిపారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అంతేకాక, శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు వచ్చే వరద ప్రవాహం కూడా తగ్గుతుంది. దీనివల్ల రెండు రాష్ట్రాల్లో కృష్ణా బేసిన్‌లోని ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

అప్పర్‌ భద్రకు 2014లోనే శ్రీకారం
నిజానికి అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు కర్ణాటక సర్కార్‌ 2014లోనే రూ.16,125.28 కోట్లతో శ్రీకారం చుట్టింది. ఆ ప్రాజెక్టు స్వరూపం ఇదీ.. 
► తుంగ జలాశయానికి ఎగువన తుంగ నది నుంచి జూన్‌–అక్టోబర్‌ మధ్య రోజూ 1,342 క్యూసెక్కుల చొప్పున 17.4 టీఎంసీలను 80 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసి.. ఆ నీటిని 11.263 కి.మీల పొడవున తవ్వే కాలువ ద్వారా తరలించి, భద్ర జలాశయంలోకి పోస్తారు.
► భద్ర జలాశయం నుంచి జూన్‌–అక్టోబర్‌ మధ్య రోజుకు 2,308 క్యూసెక్కుల చొప్పున 29.90 టీఎంసీలను ఎత్తిపోసి.. ఆ నీటిని 47.50 కి.మీల (ఇందులో అజాంపుర వద్ద 6.9 కి.మీల పొడవున సొరంగంతో సహా) పొడవున తవ్వే కెనాల్‌ ద్వారా తరలిస్తారు.
► భద్ర జలాశయం నుంచి తవ్వే ప్రధాన కాలువ 47.5 కి.మీ వద్ద రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా చిత్రదుర్గ, జగల్‌పూర్, తుమకూర్‌ బ్రాంచ్‌ కెనాల్‌లోకి నీటిని ఎత్తిపోసి.. చిక్‌మంగుళూర్, చిక్‌బళాపూర్, తుమకూర్, దావణగెరె జిల్లాల్లో సూక్ష్మ నీటిపారుదల విధానంలో 2,25,515 హెక్టార్ల (6,31,390 ఎకరాలు) ఆయకట్టుకు నీళ్లందిస్తారు. ఈ నాలుగు జిల్లాల్లో 367 చెరువులను నింపి.. వాటి కింద ఆయకట్టును స్థిరీకరిస్తారు.
► ఇందులో తుంగ నుంచి నీటిని ఎత్తిపోసే పనులను రూ.324 కోట్లతో.. భద్ర జలాశయం నుంచి నీటిని తరలించే పనులను రూ.1,032 కోట్లతో.. అజాంపుర వద్ద సొరంగం పనులను రూ.223.96 కోట్లతో మే, 2019 నాటికే పూర్తిచేసింది.
► మే, 2019 నాటికే పనులు, భూసేకరణ నిమిత్తం ఈ ప్రాజెక్టుకు రూ.4,830 కోట్లను ఖర్చుచేసిన కర్ణాటక సర్కార్‌.. 2018లో ఈ ప్రాజెక్టుకు అనుమతి కోసం సీడబ్ల్యూసీకి దరఖాస్తు చేసింది.
► నిబంధనలకు విరుద్ధంగా అప్పర్‌ భద్ర ప్రాజెక్టును కర్ణాటక చేపడుతున్నా ఏపీలో అప్పటి తెలుగుదేశం సర్కార్‌ నోరెత్తలేదు. ఇక ప్రాజెక్టు పనులకు రూ.4,830 కోట్లను ఖర్చు చేశాక.. అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడాన్ని సీడబ్ల్యూసీ కూడా తప్పు పట్టకపోవడం గమనార్హం.

కర్ణాటక కాకిలెక్కలు..
కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన నీటిలో పది టీఎంసీలు, తుంగ ఆనకట్ట ఆధునికీకరణవల్ల 6.25, భద్ర ఆనకట్ట ఆధునికీకరణవల్ల 0.5, విజయనగర ఛానల్స్‌ ఆధునికీకరణవల్ల 6.25 వెరసి 13 టీఎంసీలు మిగిలాయని.. కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాల్లో దక్కే వాటాలో 2.40 టీఎంసీలు, మిగులు జలాలు ఆరు టీఎంసీలు.. ప్రవాహ నష్టాలుపోనూ 29.90 టీఎంసీలను అప్పర్‌ భద్ర ప్రాజెక్టు ద్వారా వినియోగించుకుంటామని సీడబ్ల్యూసీకి కర్ణాటక సర్కార్‌ ఇచ్చిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లో పేర్కొంది. కానీ, తుంగ, భద్ర, విజయనగర ఛానల్స్‌ ఆధునికీకరణవల్ల నీటి వినియోగం ఏమాత్రం తగ్గలేదు సరికదా మరింత పెరిగిందని తుంగభద్ర బోర్డు అధికార వర్గాలే స్పష్టంచేస్తున్నాయి. కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన నీటి కంటే కర్ణాటక అధికంగా వినియోగిస్తున్నట్లు కేడబ్ల్యూడీటీ–2 పేర్కొంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. అప్పర్‌ భద్రకు నీటి లభ్యతపై కర్ణాటక సర్కార్‌ కాకిలెక్కలు చెబుతున్నట్లు స్పష్టమవుతోంది.

కర్ణాటక సర్కార్‌ డీపీఆర్‌లో పేర్కొన్న అంశాలపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేయకుండా.. అప్పర్‌ భద్ర ప్రాజెక్టువల్ల ప్రతికూల ప్రభావం పడుతుందా లేదా అన్న అంశంపై దిగువ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల అభిప్రాయం తీసుకోకుండా.. కనీసం తుంగభద్ర బోర్డుకు సమాచారం ఇవ్వకుండా ఆ ప్రాజెక్టుకు టీఏసీ అనుమతివ్వడంపై నీటి పారుదలరంగ నిపుణులు నివ్వెరపోతున్నారు. ఒక్క భద్ర జలాశయం ద్వారా గతేడాది వంద టీఎంసీలను కర్ణాటక వినియోగించుకుందని.. అప్పర్‌ భద్ర ప్రాజెక్టు పూర్తయితే.. తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం వచ్చే రోజులు గణనీయంగా తగ్గుతాయని.. అనావృష్టి పరిస్థితులు ఏర్పడినప్పుడు చుక్క నీరు కూడా తుంగభద్ర జలాశయానికి వచ్చే అవకాశం ఉండదని.. ఇది కరువు పీడిత ప్రాంతాలైన రాయలసీమ, తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్‌ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని సీడబ్ల్యూసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.  

>
మరిన్ని వార్తలు