శ్రీశైలం గేట్ల నిర్వహణ భేష్‌ 

5 Jan, 2022 10:26 IST|Sakshi
ప్రాజెక్టు అధికారులతో చర్చిస్తున్న డీఎస్సార్సీ బృందం

రాష్ట్ర జలవనరుల అధికారులకు డీఎస్సార్పీ అభినందన

సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ల ప్రకారం ప్లంజ్‌ పూల్‌కు మరమ్మతులు

ఆప్రాన్‌ ఆధునికీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌

కొండ చరియలు విరిగి పడకుండా మెస్, షార్ట్‌ క్రీటింగ్‌తో అడ్డుకట్ట

ప్రాజెక్టు ఆధునికీకరణకు డ్రిప్‌ కింద రుణం మంజూరుకు కేంద్రానికి సిఫార్సు చేస్తామని వెల్లడి   

సాక్షి, అమరావతి/శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల నిర్వహణ చాలా సమర్ధవంతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డ్యామ్‌ సేఫ్టీ రివ్యూ ప్యానల్‌ (డీఎస్సారీ్ప) ప్రశంసించింది. ప్రాజెక్టు అధికారులు, రాష్ట్ర జలవనరుల శాఖను అభినందించింది. ప్రాజెక్టు ఆధునికీకరణకు డ్రిప్‌ (డ్యామ్‌ రిహాబిలిటేషన్‌ అండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌) కింద రుణం మంజూరుకు కేంద్రానికి సిఫార్సు చేస్తామని ప్యానల్‌ చైర్మన్‌ ఏబీ పాండ్య తెలిపారు. సోమవారం శ్రీశైలం ప్రాజెక్టును తనిఖీ చేసిన పాండ్య నేతృత్వంలోని డీఎస్సార్పీ.. మంగళవారం కర్నూలు ప్రాజెక్ట్స్‌ సీఈ మురళీనాథ్‌రెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు ఎస్‌ఈ, ఈఈ తదితరులతో సమావేశమైంది.

ప్రాజెక్టు స్థితిగతులు, ఆధునికీకరణపై సమీక్షించింది. ప్రాజెక్టు ప్లంజ్‌ పూల్‌కు 2002 నుంచి 2004 మధ్య వేసిన కాంక్రీట్‌ ఆ తర్వాత వచ్చిన వరదల ఉద్ధృతికి కొట్టుకుపోయినట్లు డీఎస్సార్పీ గుర్తించింది. భారీ కాంక్రీట్‌ దిమ్మెలను ప్లంజ్‌ పూల్‌లో వేసి, వాటిపై అధిక ఒత్తిడితో కాంక్రీట్‌ మిశ్రమాన్ని పోయడం ద్వారా గొయ్యిని పూడుస్తామని సీఈ మురళీనాథ్‌రెడ్డి చెప్పారు. ఈ డిజైన్‌ను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు పంపాలని ప్యానల్‌ చైర్మన్‌ సూచించారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్‌ ప్రకారమే ప్లంజ్‌ పూల్‌కు మరమ్మతులు చేయాలని స్పష్టం చేశారు. 

కొండ చరియలు విరిగి పడకుండా.. 
శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌ వేకు ఎగువన, దిగువన కొండచరియలు విరిగి పడి ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుతున్నట్లు అధికారులు వివరించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద కొండ చరియలు పడకుండా మెస్, షార్ట్‌ క్రీటింగ్‌ కాంక్రీట్‌తో అడ్డుకట్ట వేస్తున్న తరహాలోనే.. శ్రీశైలంలోనూ చేస్తామని అధికారులు చేసిన ప్రతిపాదనకు డీఎస్సార్పీ ఆమోదం తెలిపింది. గ్యాలరీలో సీపేజ్‌కు అడ్డుకట్ట వేయడానికి గ్రౌటింగ్‌ చేపట్టాలని ఆదేశించింది. రివర్‌ స్లూయిజ్‌ గేట్లకు తక్షణమే మరమ్మతులు చేయాలని, ఆప్రాన్‌కు ప్రాధాన్యత క్రమంలో మరమ్మతులు చేయాలని సూచించింది. 

అధునాతన వరద పర్యవేక్షణ కార్యాలయం 
ప్రాజెక్టు వద్ద వరద పర్యవేక్షణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డీఎస్సార్పీ సూచించింది. ప్రాజెక్టు అధికారులకు 40 ఎకరాల్లో గతంలో నిర్మించిన క్వార్టర్స్‌ను (ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి) కూల్చివేసి, కొత్తవి నిర్మించడానికి అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టు మరమ్మతులు, ఆధునికీకరణ, క్వార్టర్స్‌ నిర్మాణానికి డ్రిప్‌ కింద రుణమివ్వాలని కేంద్రానికి సిఫార్సు చేస్తామని డీఎస్సార్పీ తెలిపింది. ఈ పనులకు రూ.780 నుంచి రూ.1,000 కోట్ల మేర వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామని పాండ్య తెలిపారు.

మరిన్ని వార్తలు