పోలవరం బ్యాక్‌వాటర్‌ ప్రభావంపై.. మళ్లీ అధ్యయనం కుదరదు

8 Oct, 2022 06:05 IST|Sakshi

ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణకు తేల్చిచెప్పిన సీడబ్ల్యూసీ.. అన్ని ప్రాజెక్టుల్లాగే దీనిపైనా అధ్యయనం చేశాం

అక్కడలేని అభ్యంతరం ‘పోలవరం’పైనే ఎందుకు?

సీడబ్ల్యూసీ అధ్యయనానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌.. జూలై వరదలకు భద్రాచలం సహా 103 గ్రామాలు ముంపునకు గురయ్యాయన్న తెలంగాణ ఈఎన్‌సీ

మీరూ రాజకీయ నేతల్లా మాట్లాడితే ఎలా అంటూ సీడబ్ల్యూసీ చైర్మన్‌ చురకలు.. వరదలకు ఎక్కడ 

ఎంత నీటి మట్టం పెరిగిందో 19లోగా వివరాలివ్వండి

వాటిని విశ్లేషించి నిర్ణయం తీసుకుంటామన్న సీడబ్ల్యూసీ

ముంపు ప్రాంతాలపై సంయుక్త సర్వే, కరకట్టల నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణకు ఛత్తీస్‌గఢ్‌ ఓకే

బ్యాక్‌వాటర్‌ ప్రభావంపై అధ్యయనం చేస్తేనే సహకరిస్తామన్న ఒడిశా.. సీడబ్ల్యూసీ చైర్మన్‌ తీవ్ర అభ్యం తరం.. ట్రిబ్యునల్‌కు లోబడే నిర్మిస్తున్నామని స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: గోదావరికి గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని ఐఐటీ–హైదరాబాద్, 58 లక్షల క్కూసెక్కుల వరద వస్తుందని ఐఐటీ–రూర్కీ అధ్యయనంలో వెల్లడైందని.. వాటిని పరిగణలోకి తీసుకుని పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ ప్రభావంపై అధ్యయనం చేయాలని ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఈఎన్‌సీలు చేసిన ప్రతిపాదనను సీడబ్ల్యూసీ చైర్మన్‌ డాక్టర్‌ ఆర్కే గుప్తా తోసిపుచ్చారు.

గరిష్ట వరదలవల్ల బ్యాక్‌వాటర్‌ ప్రభావంతో ముంపు ఉంటుందన్న మూడు రాష్ట్రాల వాదనను కొట్టిపారేశారు. గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారమే పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే డిజైన్‌ను ఆమోదించామని.. ప్రాజెక్టు గరిష్ట వరద ప్రవాహం (పీఎంఎఫ్‌), ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేసే గరిష్ట వరద ప్రవాహం (స్టాండర్డ్‌ ప్రాజెక్ట్‌ ఫ్లండ్‌–ఎస్పీఎఫ్‌)లను పరిగణలోకి తీసుకుని బ్యాక్‌వాటర్‌ ప్రభావంపై ఆదిలోనే అధ్యయనం చేశామని గుర్తుచేశారు.

తాము నిర్వహించిన అధ్యయనాల్లో బ్యాక్‌వాటర్‌ ప్రభావం ఉంటే ఆయా ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని సూచించామని.. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం కరకట్టల నిర్మాణానికి సిద్ధమైందని వివరించారు. పోలవరం ప్రాజెక్టువల్ల ఆంధ్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుందని.. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుకు సహకరించాలని కోరారు.

ముంపు ప్రాంతాలను గుర్తించడానికి ఏపీతో కలిసి సంయుక్త సర్వేకు సిద్ధమవ్వాలని ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ఈఎన్‌సీలను ఆదేశించారు. శబరి, సీలేరు నదులౖపై కరకట్టలు నిర్మించడానికి వీలుగా.. ఆ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలవరం ముంపు, బ్యాక్‌వాటర్‌ ప్రభావంపై అనుమానాలను నివృత్తి చేయడానికి గత నెల 29న కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి రామేశ్వర్‌ గుప్తాలు నాలుగు రాష్ట్రాల సీఎస్‌లతో భేటీ అయిన విషయం తెలిసిందే.

ఈ సమావేశంలో సాంకేతిక అంశాలపై చర్చించి.. ముంపు, బ్యాక్‌వాటర్‌పై అనుమానాలను పూర్తిస్థాయిలో నివృత్తి చేయడానికి నాలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలతో సమావేశాన్ని నిర్వహించాలని సీడబ్ల్యూసీ చైర్మన్‌ డాక్టర్‌ ఆర్కే గుప్తాను కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ ఆ సమావేశంలో ఆదేశించారు. దీంతో శుక్రవారం ఢిల్లీలో నాలుగు రాష్ట్రాల ఈఎన్‌సీల నేతృత్వంలోని సాంకేతిక బృందాలు, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈఓ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని సాంకేతిక నిపుణులతో ఆర్కే గుప్తా సమావేశమయ్యారు.

రాజకీయ నాయకుల్లా మాట్లాడితే ఎలా?
పోలవరం బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై సీడబ్ల్యూసీ అధ్యయనంలో తేలిన అంశాలకూ.. ఈ ఏడాది ఆగస్టులో వచ్చిన వరదలవల్ల జరిగిన ముంపునకూ క్షేత్రస్థాయిలో పొంతన కుదరడంలేదని.. ఈ నేపథ్యంలో మరోసారి బ్యాక్‌వాటర్‌ ప్రభావంపై అధ్యయనం చేయాలని ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ఈఎన్‌సీలు ఆర్కే గుప్తాను కోరారు. గోదావరికి గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరదే వస్తుందన్న అంచనాతో తాము ఏకీభవిస్తున్నామని.. కానీ, దాన్ని పరిగణలోకి తీసుకుని పోలవరం బ్యాక్‌వాటర్‌ ప్రభావంపై సీడబ్ల్యూసీ అధ్యయనంలో తేలిన అంశాలు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు సరిపోవడంలేదని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ చెప్పారు.

జూలైలో వచ్చిన వరదలవల్ల భద్రాచలం సహా ఏడు మండలాల పరిధిలోని 103 గ్రామాలు ముంపు బారిన పడ్డాయని.. 11 వేల మందిపై ప్రభావం పడిందని.. 150 గ్రామాల పరిధిలో 50 వేల ఎకరాల భూమి ముంపునకు గురైందని ఫొటోలు చూపుతూ వివరించారు. దీనిపై గుప్తా స్పందిస్తూ.. ఇంజనీర్‌లైన మీరు రాజకీయ నాయకుల్లా మాట్లాడటం తగదని చురకలంటించారు.

దేశవ్యాప్తంగా ఇతర ప్రాజెక్టులకు చేసిన తరహాలోనే పోలవరం బ్యాక్‌వాటర్‌ ప్రభావంపై అధ్యయనం చేశామని.. ఎక్కడా తమ అధ్యయనంపై ఎవరూ అభ్యంతరం తెలిపిన దాఖలాల్లేవన్నారు. బ్యాక్‌వాటర్‌ ప్రభావంపై మళ్లీ అధ్యయనం చేసే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. గోదావరికి వరద వచ్చినప్పుడు.. ఏ ప్రాంతంలో నీటి మట్టం ఎంత పెరిగిందన్న వివరాలను ఈనెల 19లోగా రాతపూర్వకంగా అందిస్తే.. వాటిని విశ్లేషించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

అప్పుడు రెండన్నారు.. ఇప్పుడు 35?
ఇక పోలవరం ప్రాజెక్టు వెనుక భాగంలో గోదావరిలో కిన్నెరసాని, ముర్రేడువాగు సహా 35 వాగులు కలుస్తాయని.. బ్యాక్‌వాటర్‌ ఈ వాగుల్లోకి ఎగదన్నడంతో ముంపునకు దారితీస్తోందని.. దీనిపై అధ్యయనం చేయాలని.. ముంపు ముప్పు తప్పించడానికి కరకట్టలు నిర్మించాలంటూ తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ వివరిస్తుండగా.. ఆర్కే గుప్తా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.

ఆదిలో కేవలం కిన్నెరసాని, ముర్రేడువాగుల ద్వారా బ్యాక్‌వాటర్‌ ప్రభావంపై అధ్యయనం చేస్తే చాలని కోరారని.. ఇప్పుడేమో 35 వాగులపై అధ్యయనం చేయాలని కోరుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి జోక్యంచేసుకుని.. కిన్నెరసాని, ముర్రేడువాగులపై అధ్యయనం చేశామని.. చెప్పుకోదగ్గ ప్రభావం ఉండదని తేలిందని.. ఆ అంశాలను తెలంగాణకు అందజేశామన్నారు.

సంయుక్త సర్వే, ప్రజాభిప్రాయ సేకరణకు ఒడిశా నో
మరోవైపు.. ముంపు ప్రభావం ఉండే ప్రాంతాలను గుర్తించడానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి సంయుక్త సర్వే నిర్వహించాలని, కరకట్టల నిర్మించడానికి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని సీడబ్ల్యూసీ చైర్మన్‌ గుప్తా ఆదేశాలను అమలుచేస్తామని ఛత్తీస్‌గఢ్‌ ఈఎన్‌సీ అంగీకరించారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి ఇప్పటికే 150 అడుగుల కాంటూర్‌ పరిధిలోని ముంపు ప్రాంతాలను గుర్తించడానికి సంయుక్త సర్వే నిర్వహించామని.. 175 అడుగుల కాంటూర్‌ పరిధిలో కూడా గుర్తించడానికి సంయుక్త సర్వే నిర్వహించాలని కోరారు.

కానీ.. ఒడిశా ఈఎన్‌సీ ఇందుకు సహకరించబోమన్నారు. దీనిపై సీడబ్ల్యూసీ చైర్మన్‌ గుప్తా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డుకు లోబడే ప్రాజెక్టును నిర్మిస్తున్నామనే అంశాన్ని గుర్తించాలని.. ఆ అవార్డు ప్రకారమే తమ కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని స్పష్టంచేశారు.  

మరిన్ని వార్తలు