తెలుగు తేజాలకు సీఎం వైఎస్‌ జగన్‌, కేసీఆర్‌ అభినందనలు

9 Aug, 2022 10:07 IST|Sakshi

కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కె. చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో తొలిసారిగా స్వర్ణం సాధించిన తెలుగు తేజం, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధును ప్రత్యేకంగా అభినందించారు. కాగా బర్మింగ్‌హామ్‌లో 12 రోజులపాటు కొనసాగిన కామన్వెల్త్‌ క్రీడోత్సవంలో భారత్‌కు మొత్తంగా 61 పతకాలు లభించాయి. 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది.

బంగారు రోజిది..
భారత బ్యాడ్మింటన్‌కు బంగారు రోజిది. కామన్వెల్త్‌లో అద్భుత విజయాలు సాధించిన సింధు, శ్రీకాంత్, లక్ష్య సేన్, సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టిలకు శుభాకాంక్షలు. దేశం గర్వపడేలా పతకాలు సాధించిన వారందరికీ నా అభినందనలు.  
– వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ సీఎం

స్వర్ణం సాధించిన పీవీ సింధుకు అభినందనలు. భవిష్యత్‌లోనూ ఆమె ఇదే విజయపరంపర కొనసాగించాలి. 
– కె.చంద్రశేఖర రావు, తెలంగాణ సీఎం

కాగా, కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు పసిడి పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రీడల చివరిరోజు సోమవారం జరిగిన బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఏడో ర్యాంకర్‌ సింధు 21–15, 21–13తో 13వ ర్యాంకర్, 2014 గేమ్స్‌ స్వర్ణ పతక విజేత మిషెల్లి లీ (కెనడా)పై గెలుపొందారు.
(చదవండి: ఈ స్వర్ణం కోసం ఎంతో నిరీక్షించాను.. ఎట్టకేలకు: సింధు)

మరిన్ని వార్తలు