హ్యాకర్ల.. వాట్సాప్‌ చీట్‌!

30 Sep, 2020 03:11 IST|Sakshi

ప్రముఖులు, వృత్తి నిపుణులే టార్గెట్‌గా హ్యాకింగ్‌

హైదరాబాద్‌లో ఒకేరోజు వందల సంఖ్యలో వాట్సాప్‌లు క్రాష్‌

ఓటీపీ నంబర్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు

ప్రజల్ని అప్రమత్తంచేసిన సీఐడీ విభాగం

సాక్షి, అమరావతి: సైబర్‌ కేటుగాళ్లు సరికొత్త మోసాలతో హడలెత్తిస్తున్నారు. కరోనా సమయంలో విస్తృతమైన ఇంటర్నెట్‌ వాడకాన్ని ఆసరాగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖులు, వృత్తి నిపుణుల వాట్సాప్, సోషల్‌ మీడియా ఖాతాలను హ్యాక్‌ చేయడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం హైదరాబాద్‌లో వందల మంది వాట్సాప్‌లు హ్యాకింగ్‌ కారణంగా క్రాష్‌ కావడం, వీరిలో పలువురు ప్రముఖులు ఉండటం కలకలం రేకెత్తిస్తోంది. 

హ్యాకింగ్‌ ఇలా: సైబర్‌ నేరగాళ్లు తొలుత ఎంపిక చేసుకున్న కొందరికి ‘అర్జంట్‌ హెల్ప్‌’ అని ఆరు డిజిట్ల కోడ్‌లతో వాట్సాప్‌ మెస్సేజ్‌  పంపిస్తారు. బాధితుడు పొరపాటున దీన్ని క్లిక్‌ చేసినా, తిరిగి సమాధానం ఇచ్చినా వెంటనే వాట్సాప్‌ ఖాతాను హ్యాక్‌ చేసి ఆ కాంటాక్ట్‌లోని పలువురికి తిరిగి ఆరు డిజిట్ల కోడ్‌ మెస్సేజ్‌ పంపిస్తారు. ఆ వెంటనే ‘సారీ...పొరపాటున మెస్సేజ్‌ పంపించా. దాన్ని నాకు తిరిగి పంపించండి’ అని కోరతారు.  ఆ మెస్సేజ్‌ను తిరిగి పంపినా, సంబంధిత లింక్‌ మీద క్లిక్చేసినా వెంటనే వారి వాట్సాప్‌ హ్యాక్‌ అవుతుంది. అందులోని సమాచారాన్ని తస్కరిస్తారు. 

“ఓటీపీ’ పరమ రహస్యమే
 – హ్యాకింగ్, సైబర్‌నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సి జాగ్రత్తలను సీఐడీ విభాగం సూచించింది. 
– ఓటీపీ నంబర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు చెప్పొద్దు.
– తెలిసినవారి నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చినా సరే, ఎవరు అడిగినా,  మెస్సేజ్‌ పెట్టినా ఓటీపీ నంబర్‌ వెల్లడించకూడదు. ఒక్కోసారి వారికి తెలియకుండానే హ్యాకింగ్‌ బారిన పడే ప్రమాదం ఉంది కాబట్టి ఓటీపీని చెప్పకూడదు. 
– ఓటీపీ నంబర్‌ కేవలం 10 నిముషాలపాటే చెల్లుబాటులో ఉంటుంది కాబట్టి ఆ కొద్దిసేపు కాలయాపన చేస్తే మోసాల బారి నుంచి కాపాడుకోవచ్చు.
–  తెలియని లింక్‌లను క్లిక్‌ చేయొద్దు
 
2 స్టెప్‌ వెరిఫికేషన్‌
 – వాట్సాప్‌ హ్యాక్‌ కాకుండా ఉండేందుకు అదనపు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అందుకోసం స్మార్ట్‌ఫోన్లలో ఉన్న ‘2 స్టెప్‌ వెరిఫికేషన్‌’ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవాలి. వాట్సాప్‌లో అకౌంట్‌ సెక్షన్‌లోకి వెళితే ‘2 స్టెప్‌ వెరిఫికేషన్‌’ ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేసి ఎనేబుల్‌ చేసుకోవాలి. అనంతరం పాస్‌వర్డ్‌ ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైనా హ్యాకర్‌ వాట్సాప్‌ను హ్యాక్‌ చేయాలని ప్రయత్నిస్తే కోడ్‌ అడుగుతుంది.  

అప్రమత్తతతో రక్షణ..
– పీవీ సునీల్‌ కుమార్, అదనపు డీజీ, సీఐడీ విభాగం
‘అప్రమత్తతే సైబర్‌నేరాల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఎవరైనా ఓటీపీ నంబర్‌ అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దు. ఒక్కోసారి బాగా చదువుకున్న వారు కూడా ఓటీపీ నంబర్‌ బహిర్గతం చేసి మోసపోతున్నారు. ఓటీపీ చెప్పకపోతే సైబర్‌ నేరగాళ్లు చాలా వరకూ ఏమీ చేయలేరు. ఎవరైనా మోసపోయామని గుర్తిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి’

నేరగాళ్ల ఫోన్లలోకి బాధితుల వాట్సాప్
 – సైబర్‌ క్రిమినల్స్‌ తమ ఫోన్‌లో వాట్సాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని ఎంపిక చేసుకున్న ఓ ఫోన్‌ నంబర్‌ను వెరిఫికేషన్‌ కోసం ఎంటర్‌ చేస్తున్నారు. దీంతో వెరిఫికేషన్‌ కోడ్‌ ఆ నెంబర్‌కు వెళుతుంది. ఆ వెంటనే సదరు నంబర్‌కు ఫోన్‌ చేస్తున్న కేటుగాళ్లు పొరపాటున మీ ఫోన్‌కు వచ్చిందని, దయచేసి ఆ వివరాలు చెప్పాలని నమ్మబలుకుతున్నారు. ఆ వివరాలు చెప్పగానే బాధితుడి వాట్సాప్‌ క్రాష్‌ అవుతుంది. ఆ వాట్సాప్‌ ఖాతా సైబర్‌ నేరగాడి ఫోన్‌లోకి మారిపోతుంది. అనంతరం వాట్సాప్‌ను యాక్సెస్‌ చేసి సెట్టింగ్స్‌ను మారేస్తున్నారు. వెరిఫికేషన్‌ కోడ్‌తోపాటు హింట్‌ ప్రశ్నను చేర్చడంతో బాధితులు మరోసారి ఇన్‌స్టాల్‌ చేసుకునేందుకు ప్రయత్నించి విఫలమవుతున్నారు. 

మరిన్ని వార్తలు