ఏపీపై తుపాను ప్రభావం!

29 Nov, 2023 05:34 IST|Sakshi

ఐదారురోజుల్లో విస్తారంగా వర్షాలకు అవకాశం 

డిసెంబర్‌ 4 నుంచి 6 వరకు భారీ వర్షాలు  

అప్రమత్తం చేసిన భారత వాతావరణ శాఖ 

వరి కోతలు సత్వరమే పూర్తి చేసుకోవాలని సూచన

సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను ప్రభావం ఆం­ధ్ర­­ప్రదేశ్‌పై ఉండనుంది. మరో ఐదారు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలను కురిపించనుంది. ఈ తుపాను ప్రభావం రాష్ట్రంపై స్వల్పంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తొలుత అంచనా వేసింది. ఆగ్నే­య బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరువ వరకే తు­పా­ను గమ్యాన్ని తెలిపే సైక్లోన్‌ ట్రాక్‌ పరిమితం కావడంతో ఈ నిర్ధారణకు వచ్చింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకే వాతావరణం పరిమితమవుతుందని పేర్కొంది.

కానీ మంగళవారం నాటికి పరిస్థితి­లో ఒకింత మార్పు కనిపించింది. సోమవారం దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం కూడా ఆ ప్రాంతంలోనే కొనసాగుతోంది. ఐఎండీ ముందస్తు నివేదిక ప్రకారం ఈ అల్పపీడనం బుధ­వా­రానికే వాయుగుండం గాను, డిసెంబర్‌ ఒకటిన తుపాను గాను బలపడాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా ఒక రోజు ఆలస్యంగా గురువారం నా­టి­కి వాయుగుండంగా, డిసెంబర్‌ 2న తుపానుగా మారనుంది.

ఇది కోస్తాంధ్ర తీరానికి సమీపంలోకి రాకపోయినా దాని ప్రభావం మాత్రం రాష్ట్రంపై ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఫలితంగా డిసెంబర్‌ 4, 5, 6 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలు చోట్ల విస్తారంగా, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ ఎస్‌.స్టెల్లా తెలిపారు. భారీ వర్షాలకు వరితో పాటు ఇతర పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల కోతకు వచ్చిన వరి పంటను వెనువెంటనే కోసి భద్రపరచుకోవాలని రైతులకు సూచించారు.

అవసరమైన చర్యలు చేపట్టాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. ఒకవేళ తుపాను కోస్తాంధ్ర వైపు పయనిస్తే వర్షాల తీవ్రత మరింత పెరుగుతుందని వా­తా­వరణ నిపుణులు చెబుతు­న్నారు. వర్షాలకు ఈదురుగాలులు తోడై పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని పేర్కొంటున్నారు. కాగా, రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర­లో ఒకటి రెండు చోట్ల, రాయలసీమ­లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

మరిన్ని వార్తలు