AP Rain Alert: దూసుకొస్తున్న ‘జవాద్‌’.. తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం

4 Dec, 2021 08:02 IST|Sakshi

విశాఖకు 300 కిమీ దూరంలో కేంద్రీకృతం..

నేటి ఉదయానికి ఉత్తరాంధ్ర–ఒడిశా తీరం సమీపంలోకి

5వ తేదీ మధ్యాహ్నం పూరీ వద్ద తీరం దాటే అవకాశం

నేడు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

గరిష్టంగా 110 కి.మీ వేగంతో బలమైన గాలులు.. వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక

ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహా 1,735 సహాయక బృందాల ఏర్పాటు

తూర్పు నావికాదళం సర్వసన్నద్ధం

సాక్షి నెట్‌వర్క్‌: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం ఉ.11.30 గంటలకు తుపానుగా మారింది. దీనికి జవాద్‌ అని పేరు పెట్టారు. ఇది ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 280 కి.మీల దూరంలో.. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి 400 కి.మీ.లు, పూరీకి 460 కి.మీ, పారాదీప్‌కి 540 కి.మీ.ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తరాంధ్ర తీరం వైపు వస్తుండగా.. శనివారం ఉదయం ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు సమీపంలోకి వెళ్లనుంది. తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల తీవ్రత పెరిగే అవకాశముందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి సునంద, అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు.

అనంతరం ఇది దిశను మార్చుకుని ఒడిశా వైపుగా 5వ తేదీ మధ్యాహ్నానికి పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఆ తర్వాత ఇది బలహీన పడి తీవ్ర వాయుగుండంగా ఒడిశా తీరం మీదుగా పశ్చిమ బెంగాల్‌ వైపు పయనించనుందని వివరించారు. దీని ప్రభావంవల్ల ఉత్తర కోస్తా తీరంలో గంటకు 80–90 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. అలాగే, శనివారం మధ్యాహ్నం 110 కి.మీ గరిష్ట వేగంతో కూడా గాలులు వీచే అవకాశాలున్నాయని వెల్లడించారు. తుపాను ప్రభావంతో సముద్రం అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఈ నెల 5 వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. తుపాను కారణంగా శనివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయంటూ రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. అదేవిధంగా శనివారం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో.. విశాఖపట్నం, భీమునిపట్నం, కళింగపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. 

సర్కారు అప్రమత్తం.. రంగంలోకి సహాయక బృందాలు 
తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులను అప్రమత్తం చేసింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఆయా జిల్లాల్లో మోహరించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ కమిషనర్‌ కే కన్నబాబు తెలిపారు. మరోవైపు.. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల నుంచి జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.

విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. గోదావరి నదిపై పాపికొండల విహార యాత్రను మూడ్రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు పర్యాటక శాఖ డీఎం వీరనారాయణ తెలిపారు. పంచాయతీరాజ్‌ శాఖ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 1,735 సహాయక బృందాలను ఏర్పాటుచేసింది. అలాగే, వాల్తేరు రైల్వే డివిజన్‌ పరిధిలో హెల్ప్‌లైన్లు ఏర్పాటుచేశారు.

హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఇవే..
– విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో : 0891–2744619, 2746330, 2746344, 2746338 
– విజయనగరం : 08922–221202, 221206, 8500358610
– శ్రీకాకుళం : 0892–286213, 286245, 8500359367 
– నౌపడ జంక్షన్‌ : 08942–83520, 85959, 8500172878 
– రాయగడ స్టేషన్‌ పరిధిలో : 06856–223400, 223500 
ఇప్పటికే 95 రైళ్లను రద్దుచేసిన వాల్తేరు డివిజన్, ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జోన్‌ అధికారులు.. తాజాగా మరో 24 రైళ్లని రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు.

నౌకాదళం సంసిద్ధత
తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో సహాయక చర్యల నిమిత్తం తూర్పు నావికాదళం సైతం సన్నద్ధంగా ఉంది. నాలుగు నౌకలు, నేవీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను సిద్ధంగా ఉంచింది. తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయం నుంచే కాకుండా రాష్ట్రంలో నేవల్‌ ఆఫీసర్స్‌ ఇన్‌ఛార్జ్, ఒడిశా అధికారులు తుపాను కదలికలు, దాని ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వంతొ నిరంతరం సమీక్షిస్తున్నారు. అలాగే..  ముందస్తు సహాయక చర్యల్లో భాగంగా 13 వరద సహాయక బృందాలను, నాలుగు డైవింగ్‌ బృందాలను, ఎయిర్‌క్రాఫ్ట్‌లను సిద్ధంచేసినట్లు తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌దాస్‌ గుప్తా తెలిపారు.

విజయనగరం జిల్లా వ్యాప్తంగా వర్షాలు
తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం వర్షాలు ప్రారంభమయ్యాయి. జిల్లా యంత్రాంగం తుపాను నష్టనివారణ చర్యలు చేపట్టింది. కలెక్టర్, జేసీలు తీరప్రాంత గ్రామాల్లో తిష్టవేశారు. శ్రీకాకుళంలో  ప్రత్యేకాధికారి హెచ్‌. అరుణ్‌కుమార్, కలెక్టర్‌ శ్రీకేష్‌ బి. లాఠకర్‌లతో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ శుక్రవారం సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రత్యేకాధికారులు, ప్రజాప్రతినిధులు తీరప్రాంత గ్రామాల్లో పర్యటించారు. తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడలో కెరటాలు తీరాన్ని ముక్కలు చేశాయి. ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన జియోట్యూబ్‌ రక్షణ గోడను సైతం ఛిన్నాభిన్నం చేశాయి. కెరటాలు దూసుకువచ్చి మత్స్యకారుల ఇళ్లపై విరుచుకుపడ్డాయి. మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. 
 

మరిన్ని వార్తలు