కోస్తాంధ్రపై ‘మిచాంగ్‌’ తుపాను పడగ! 

2 Dec, 2023 04:44 IST|Sakshi

రేపు తుపానుగా బలపడే అవకాశం.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం.. కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు 

5న నెల్లూరు–మచిలీపట్నం మధ్య తీరం దాటే ఛాన్స్‌ 

రేపట్నుంచి సీమ, దక్షిణ కోస్తాంధ్రకు భారీ వర్షాలు 

సాక్షి, విశాఖపట్నం/ సాక్షి, అమరావతి: బంగాళా­ఖాతంలో ఏర్పడనున్న తుపాను కోస్తాంధ్రపై పడగ విప్పనుంది. రాయలసీమలోనూ పెను ప్రభావం చూపనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది. తుపాను ప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాల­ని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకో­వా­లని కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్ర, జిల్లా స్థా­యిల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసింది. తాడేపల్లిలో రాష్ట్ర కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి, ఫోన్‌ నంబర్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేసింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయు­గుండం శుక్రవారం రాత్రికి నెల్లూరుకు ఆగ్నేయంగా 790, బాపట్లకు దక్షిణ ఆగ్నేయంగా 860, మచిలీపట్నానికి దక్షిణ

ఆగ్నేయంగా 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయ­వ్య దిశగా పయనిస్తూ శనివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. అనంతరం పశ్చిమ వాయ­వ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తుపానుగా బలపడుతుంది. ఆపై వాయవ్య దిశగా పయనిస్తూ ఈనెల 4వ తేదీకి దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుకుంటుంది. అనంతరం ఉత్తర దిశగా కదులుతూ ఐదో తేదీ ఉదయం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరా­న్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.

రానున్న రెండు రోజులు గంటకు 50 నుంచి 60 కి.మీలు, తీరాన్ని దాటే సమయంలో గంటకు 80–90 కి.మీలు, గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ తుపానుకు మయన్మార్‌ సూచించిన ‘మిచాంగ్‌’గా నామకరణం చేయనున్నారు. తుపాను ప్రభావం శనివారం నుంచి మొదలై ఈ నెల ఐదో తేదీ వరకు కొనసాగనుంది. 

కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు 
తుపాను నేపథ్యంలో తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. ఇక్కడి నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తామన్నారు. జిల్లాల యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు తెలిపారు.  ప్రజలు అత్యవసర సçహాయం, వాతావరణ సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు 1070, 112, 18004250101లో సంప్రదించాలని తెలిపారు.

మరిన్ని వార్తలు