డేంజరస్‌ మాండూస్‌.. ఏపీలో ఈదురు గాలులతో భారీ వర్షం!

8 Dec, 2022 06:58 IST|Sakshi

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిలాల్లో వర్షాలు 

వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచన 

సాక్షి, అమరావతి /సాక్షి, విశాఖపట్నం:  బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం ఉదయం తుపానుగా మారనుంది. ప్రస్తుతం  ఇది గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా శ్రీలంక, తమిళనాడు వైపు దూసుకు వస్తోంది. బుధవారం రాత్రి ట్రింకోమలీ (శ్రీలంక)కి 410 కిలోమీటర్లు, జాఫ్నాకు (శ్రీలంక) 550 కిలోమీటర్లు, కారైకాల్‌కు 610 కిలోమీటర్లు, చెన్నైకి 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. 

ఈ తుపానుకు మాండూస్‌ అని పేరు పెట్టారు. 9వ తేదీ రాత్రి తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో తీరం దాటుతుందని చెబుతున్నారు. తీరాన్ని దాటే సమయంలో గంటకు 65–75 కి.మీలు, గరిష్టంగా 85 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. తీరం దాటిన తర్వాత వాయుగుండంగా బలహీనపడి చిత్తూరు వైపు కదులుతుందని చెబుతున్నారు. గురువారం నుంచి 10వ తేదీ వరకు తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.

అప్రమత్తమైన యంత్రాంగం
తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాలను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సముద్రం అలజడిగా ఉంటుందని, దక్షిణకోస్తా – తమిళనాడు తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే వెనక్కి తిరిగి రావాలని కోరారు. 

మాండూస్‌ ప్రభావంతో 8వ తేదీ నుంచి 3 రోజులపాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 10, 11 తేదీల్లో ఏపీలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మరిన్ని వార్తలు