‘నివర్‌’ బీభత్సం

27 Nov, 2020 05:12 IST|Sakshi
గురువారం వైఎస్సార్‌ జిల్లా రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట వద్ద కడప – తిరుపతి రహదారిపై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు

రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు

విడిపోతూ.. విజృంభిస్తూ పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిన తుపాను.. వణికిన చెన్నై

నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో

కుండపోత.. లోతట్టు ప్రాంతాలు జలమయం

వాగులను తలపిస్తున్న రహదారులు.. పొంగిపొర్లుతున్న పెన్నా, కుందూ

వెంకటగిరి – రాపూరు మధ్య కుప్పకూలిన ఎన్‌హెచ్‌ వంతెన

సహాయక కార్యక్రమాల్లో అధికార యంత్రాంగం, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నిమగ్నం

రంగంలోకి ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్‌ దక్షిణ కోస్తా, రాయలసీమల్లో నేడూ వర్షాలు

సాక్షి, అమరావతి, విశాఖపట్నం/ సాక్షి నెట్‌వర్క్‌ : నివర్‌ తుపాను అతి తీవ్రంగా ప్రభావం చూపడంతో బుధవారం రాత్రి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో కొన్ని జిల్లాల్లో పరిస్థితి అతలాకుతలంగా మారింది. చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో ఊహించనంతగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రహదారులు వాగులను తలపిస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు నగరాల్లో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. పెన్నా, కుందూ స్వర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

పలుచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. అధికార యంత్రాంగం, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. జాతీయ విపత్తు సహాయ దళాలు, రాష్ట్ర విపత్తు సహాయ దళాలు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారడంతో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు అధికారులను ఆదేశించారు.

రాత్రి 2.30 గంటల సమయంలో తీరం దాటిన తుపాన్‌
► బుధవారం అర్థరాత్రి 11.30 గంటలకు సముద్రంలో కల్లోలం సృష్టిస్తూ.. ‘నివర్‌’ తుపాన్‌ తీరం వైపు కదిలింది. రాత్రి 2.30 గంటల సమయంలో గంటకు 120 నుంచి 130 కి.మీ వేగంతో గరిష్టంగా 145 కి.మీ వేగంతో వీచిన బలమైన గాలులతో భూమిని తాకి.. వాయవ్య దిశగా పయనమైంది.
► అయినా సముద్రంలో కల్లోలం కొనసాగుతుండటంతో ఆశ్చర్యపోయిన వాతావరణ కేంద్రం అధికారులు.. ఇంకా నివర్‌లోని కొంత భాగం అక్కడ ఉందని గుర్తించారు. తెల్లవారుజామున 3 గంటలకు మిగిలిన భాగం కూడా తీరం వైపు కదిలి, ముందు భాగంలో విలీనమై అతి తీవ్ర తుపాన్‌గా తీరం దాటింది.
► తుఫాన్‌ నేపథ్యంలో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం, వాడరేవు పోర్టుల్లో లోకల్‌ సిగ్నల్‌ మూడో నంబర్‌ ప్రమాద హెచ్చరిక సూచీని ఎగరేశారు.
► శుక్రవారం ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా  చోట్ల కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశం ఉంది.  

నెల్లూరు జిల్లా అతలాకుతలం
► పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కుంభవృష్టి కురిసింది. కోట మండలంలో ఒక్క రాత్రికే 25 సెం.మీ.వర్షం కురిసింది. 30 మండలాల్లో 10 సెం.మీ. నుంచి 24 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
► లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరింది. గూడూరు వద్ద ఏషియన్‌ హైవే పైకి వరద నీరు రావడంతో రెండు మార్గాల్లో పూర్తి స్థాయిలో వాహనాలను నిలిపివేశారు. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
► నాయుడుపేట–తిరుపతి మార్గంలో రహదారిపైకి వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌ను మళ్లించారు. వెంకటగిరి–రాపూరు మార్గంలోని నేషనల్‌ హైవేలో లింగసముద్రం వద్ద బ్రిడ్జి కూలిపోయింది. ఆత్మకూరు–సోమశిల ప్రధాన రహదారిపై దేపూరు వద్ద వరద నీరు చేరి రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.
► జిల్లాలోని పెన్నానదితో పాటు కాళంగి, స్వర్ణముఖి, ఉపనదులైన బొగ్గేరు, కేతామన్నేరు, పంబలేరు, చిప్పలేరు, కైవల్యా, గొడ్డేరు పొంగి ప్రవహిస్తున్నాయి. అన్ని చెరువులు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి.  లింగాలపాడు చెరువుకు గండిపడడంతో నీరంతా గ్రామాన్ని చుట్టుముట్టింది. బొప్పాయి, మిరప, మినుము పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
► ఈదురు గాలులకు 89 పెద్ద చెట్లు, పలు చోట్ల విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాల నుంచి 3,365 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి వసతి, భోజనం ఏర్పాట్లు చేశారు.
►  వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల వల్ల సోమశిల ప్రాజెక్టుకు 1.11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద చేరుతోంది. దీంతో సోమశిల అన్ని గేట్లు ఎత్తేసి 1.20 లక్షల క్యూసెక్కుల నీటిని పెన్నానది ద్వారా సముద్రంలోకి వదులుతున్నారు. దీంతో పెన్నా పరీవాహక గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాయి. కలెక్టర్‌ చక్రధర్‌బాబు, జేసీలు ప్రభాకర్‌రెడ్డి, హరేందర ప్రసాద్‌   సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.  గూడూరు నుంచి 50 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసీ బస్సు తిప్పవరప్పాడు వద్ద కాజ్‌వేను దాటుకుని సైదాపురం కైవల్యా బ్రిడ్జి సమీపానికి వెళ్లే సరికి అక్కడ రోడ్డుపై ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుండడంతో ఆగిపోయింది. వెనక్కు మళ్లించే సరికి కాజేవేపై ఐదు అడుగుల మేర నీటి ప్రవాహం పెరగడంతో బస్సు సహా, ఇతర వాహనాలను నిలిపివేశారు.

కిలోమీటర్‌ చొచ్చుకు వచ్చిన సాగరతీరం
► కృష్ణా జిల్లాలోని హంసలదీవి సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. సుమారు మూడు మీటర్లు ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. కిలోమీటర్‌ మేర నీరు ముందుకు చొచ్చుకువచ్చింది. మూడు కిలోమీటర్ల మేర ఇసుకతిన్నెలు కోతకు గురయ్యాయి.  
► కృష్ణా జిల్లాలో 27,769 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనా. గన్నవరం విమానాశ్రయంలో 10 సర్వీసులకు గాను మూడు మాత్రమే వచ్చాయి. ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 7 సర్వీసులు విజిబిలిటీ లేక రద్దయ్యాయి.   

చిత్తూరు జిల్లా గజగజ
► చిత్తూరు జిల్లాను నివర్‌ తుపాను చిగురుటాకులా వణికించింది.
► సదు మండలం జాండ్రపేట పొట్టెంవారిపల్లెకు వెళ్లే రహదారి పక్కనున్న చెరువులో గుర్తుతెలియని మహిళ గల్లంతయ్యారు. సోమల మండలం సీతమ్మ చెరువు పొంగి ప్రవహించడంతో అటుగా వాహనంలో వెళ్తున్న నలుగురు వాగు ఉధృతికి కొట్టుకుపోయారు. వీరిని పోలీసులు సురక్షితంగా కాపాడారు.
► పెద్దమండ్యం మండలం కలిచెర్ల వద్ద పాపిరెడ్డి చెరువు మొరవ ఉధృతంగా పోతోంది. దాన్ని దాటే క్రమంలో పాల వ్యాన్‌ కొట్టుకుపోగా అందులో ఉన్న ఇద్దరు దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు.
► కాణిపాకం సమీపంలోని పుణ్యసముద్రం వద్ద ఒకరు వరదలో చిక్కుకోగా అతన్ని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. తిరుమల ఘాట్‌ రోడ్లలో బండరాళ్లు విరిగిపడ్డాయి. చెట్లు నేలకూలాయి. మాడ వీధులు, శ్రీవారి ఆలయం ఎదుట నీరు ప్రవహిస్తోంది. పాపవినాశనం, గోగర్భం గేట్లను ఎత్తిని నీటి విడుదల చేస్తున్నారు.  శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు టీటీడీ  ప్రకటించింది. తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.   

కడపలో భయపెడుతున్న బుగ్గవంక
► కడప నగరంలో 19,000 క్యూసెక్కులతో బుగ్గవంక ఉధృతంగా ప్రవహిస్తోంది. నాగరాజుపేట, రవీంద్రనగర్, ద్వారకానగర్, బాలాజీనగర్, మోచంపేట, పాతబస్టాండ్‌ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కలెక్టర్‌ హరికిరణ్‌ అధికారులను అప్రమత్తం చేశారు.
► కడప–తిరుపతి రహదారిలోని ఊటుకూరు, బాలుపల్లెల వద్ద ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తడంతో రాయచోటి వైపు ›ట్రాఫిక్‌ మళ్లించారు. రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల్లో అరటి, బొప్పాయి తోటలు నేలకూలాయి.  
► గుంటూరు జిల్లాలోని పశ్చిమ డెల్టా, పల్నాడు ప్రాంతంలో కోతకు సిద్ధంగా ఉన్న వరి నేల వాలింది. పత్తి, మిరప పంటలపై తుపాన్‌ ప్రభావం చూపింది.
► ప్రకాశం జిల్లాలో లోతట్టు ప్రాంతాలు, పంట పొలాల్లో నీరు చేరింది. పలు చోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. 131 పునరావాస కేంద్రాలు, 93 తుపాను షెల్టర్లను సిద్ధం చేశారు.

ఇదీ వర్షపాతం..
రైల్వేకోడూరులో 25 సెం.మీ, వెంకటగిరిలో 24 సెం.మీ, గూడూరులో 19, రాపూరులో 16, ఆత్మకూరు, సూళ్లూరుపేటలో 15, నెల్లూరు, కావలి, సత్యవేడు, సంబెపల్లెలో 14, రాజంపేట, తిరుపతిలో 13, తొట్టెంబేడు, పుత్తూరులో 12 సెం.మీ వర్షపాతం నమోదైంది.

అల్పపీడనాల కాలం..
హిమాలయాల్లో ఈ ఏడాది మే, జూన్‌ మాసాల్లో కొనసాగిన ఇంట్రా ట్రాపికల్‌ కన్వర్జెన్స్‌ జోన్‌ (ఈశాన్య, ఆగ్నేయ గాలులు కలిసే ప్రాంతం) ప్రస్తుతం అరేబియా, బంగాళాఖాతాల్లో కొనసాగుతోంది. దీని వల్ల ఈ రెండు సముద్రాల్లో అల్పపీడనాలు వరుసగా ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ నిపుణుడు, ఏయూ వాతావరణ విభాగ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ భాను కుమార్‌ తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 29న దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వివరించారు. డిసెంబర్‌ నెలలోనూ వరుసగా తమిళనాడు సమీప సముద్ర తీరాల్లో అల్పపీడనాలు ఏర్పడతాయని చెప్పారు.

తమిళనాడుకు తప్పిన భారీ ముప్పు
సాక్షి ప్రతినిధి, చెన్నై: భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టానికి దారితీయకుండా తమిళనాడులో నివర్‌ తుపాన్‌ గురువారం తెల్లవారుజామున తీరం దాటింది. కేవలం రెండు జిల్లాలపై మాత్రమే ప్రభావం చూపడంతో భారీ నష్టం తప్పింది. గురువారం తెల్లవారుజాము 4 గంటల వరకు భయానక పరిస్థితులు కొనసాగాయి. విల్లుపురం, తిరువణ్ణామలై, కల్లకురిచ్చి, వేలూరు జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం వరకు తుపాన్‌ తీరందాటిన ప్రభావం కొనసాగింది. పుదుచ్చేరి–మరక్కానం మధ్య విల్లుపురం జిల్లా అళగన్‌కుప్పం ప్రాంతాన్ని ఎన్నడూ ఎరుగని రీతిలో అతిభారీ వర్షం, తీవ్రస్థాయిలో ఈదురుగాలులు కుదిపేశాయి. దీంతో వేలాది వృక్షాలు కూలిపోయాయి. ముగ్గురు మృతి చెందారని అధికారులు తెలిపారు. విద్యుత్‌ సరఫరాను ముందుగానే నిలిపి వేయడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకోలేదు. కడలూరు, విల్లుపురం జిల్లాలో ఊహించిన దానికంటే ఎక్కువ నష్టం సంభవించింది.

► 2015 డిసెంబర్‌ స్థాయిలో కాకున్నా నివర్‌ తుపాన్‌ ధాటికి చెన్నై మరోసారి నీట మునిగింది. మొత్తం 5 లక్షల ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించగా ప్రజలు జలదిగ్బంధనంలో చిక్కుకుపోయారు.
► చెన్నై శివార్లలోని తాంబరం–ముడిచ్చూరులలో గత 24 గంటల్లో 31.4 సెంటీమీటర్ల వర్షం పడడంతో 10 వేలకు పైగా ఇళ్లు వరద నీటితో నిండిపోయాయి.  
► ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ప్రజలను రబ్బర్‌ బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నగరంలో 267 వృక్షాలు కూలిపోయాయి. చెన్నై విమానాశ్రయాన్ని మూసివేశారు.


సహాయక చర్యల కోసం కడపలోని కోటిరెడ్డి సర్కిల్‌ వద్ద పడవను సిద్ధం చేసిన యంత్రాంగం


నెల్లూరు జిల్లా లింగ సముద్రం వద్ద వరద ఉధృతికి కూలిన బ్రిడ్జి


చిత్తూరులో వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతానికి తీసుకువస్తున్న సహాయక సిబ్బంది


నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో నీట మునిగిన సవారి గుంట ప్రాంతం


తిరుమలలోని ప్రధాన ఆలయం వద్ద వరద నీరు
 


భారీ వర్షాలకు కొండపై నుంచి పడుతున్న నీటితో నిండుగా కపిలతీర్థం


తిరుపతిలో బాధితులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి


ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో రోడ్డుపై కూలిన చెట్టును తొలగిస్తున్న పోలీసులు


ఈదురు గాలుల ధాటికి పుదుచ్చేరిలో రోడ్డుపై విరిగిపడిన చెట్టు


నివర్‌ తుపాన్‌కు జలమయమైన చెన్నైలోని ముడిచ్చూరు ప్రాంతం

మరిన్ని వార్తలు