దూసుకొస్తున్న ‘నివర్‌’

24 Nov, 2020 03:32 IST|Sakshi

నేడు తుపానుగా మారనున్న వాయుగుండం

నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

కోత దశకు వచ్చిన పంటల్ని కాపాడు కోవాలి.. 26 వరకూ వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక

ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి సీఎస్‌లతో కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి సమీక్ష

అప్రమత్తమైన విపత్తుల నిర్వహణ, కుటుంబ సంక్షేమ, విద్యుత్‌ శాఖలు

సాక్షి, విశాఖపట్నం/అమరావతి/న్యూఢిల్లీ: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం సోమవారం ఉదయం మరింత బలపడి వాయుగుండంగా మారింది. గంటకు 11 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ ఆగ్నేయ బంగాళాఖాతంలో పాండిచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశగా 500 కి.మీ., చెన్నయ్‌కి ఆగ్నేయ దిశగా 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మంగళవారం మరింత బలపడి తుపానుగా మారే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. తుపాను ఏర్పడితే ప్రపంచ వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం.. ఇరాన్‌ సూచించిన ‘నివర్‌’ అనే పేరు పెడతామని ఐఎండీ అధికారులు తెలిపారు.

ఇది వాయువ్య దిశగా ప్రయాణించి పాండిచ్చేరిలోని కరైకల్, తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో మళ్లాపురం ప్రాంతం వద్ద ఈ నెల 25న (బుధవారం) తుపానుగా మారుతుందని.. ఆ రోజు సాయంత్రం లేదా రాత్రి అదే ప్రాంతంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్లు, గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని దాటవచ్చని తెలిపారు. దీని ప్రభావంతో ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మంగళవారం తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతోనూ.. 25, 26 తేదీల్లో గంటకు 65 నుంచి 75 కిలోమీటర్లు.. గరిష్టంగా 85 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. ఈ దృష్ట్యా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. 
 తమిళనాడు, పుదుచ్చేరి వైపుగా కదులుతున్న వాయుగుండం   

పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు
వాయుగుండం తుపానుగా మారనుందన్న సమాచారంతో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో ఒకటో నంబర్‌.. గంగవరం, కాకినాడ పోర్టుల్లో నాలుగో నంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కళింగపట్నం ఓడరేవుకు అప్రమత్తత సమాచారం అందించినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రైతులు చేతికొచ్చిన పంటల్ని వెంటనే జాగ్రత్తపర్చే ఏర్పాట్లలో ఉండాలని సూచించారు. 

మూడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు
దీని ప్రభావంతో రాష్ట్రంలోని నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తీరం తీవ్ర అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించారు. ఉత్తర కోస్తాంధ్రలో చాలాచోట్ల మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో అనేకచోట్ల మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయి. బుధవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

యంత్రాంగం అప్రమత్తం
తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిషనర్‌ కె.కన్నబాబు సూచించారు. మరోవైపు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేయాలని, సరిపడా ఔషధాలు నిల్వ ఉంచుకోవాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనరేటర్లను, ప్రతి పీహెచ్‌సీలో రెండేసి అంబులెన్స్‌లను సిద్ధం చేయాలన్నారు. గర్భిణులు, వృద్ధులు, ఐదేళ్లలోపు చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణులను సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించాలన్నారు. 

విద్యుత్‌ శాఖ హై అలెర్ట్‌
ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు విద్యుత్‌ శాఖ ఉద్యోగులు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి ఆదేశించారు. డిస్కమ్‌ల సీఎండీలు, జిల్లాల సూపరింటెండెంట్‌ ఇంజనీర్లతో సోమవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, లైన్లు, టవర్లను భౌగోళిక సమాచార విధానం (జీఐఎస్‌) పరిధిలోకి తీసుకచ్చామని, ముంపు ప్రమాదం ఉన్న టవర్లు, సబ్‌ స్టేషన్లు, లైన్ల వద్దకు వీలైనంత త్వరగా చేరుకునే మార్గాలను జీఐఎస్‌ ద్వారా సిబ్బంది తెలుసుకుని తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. 

ప్రాణ నష్టం లేకుండా చూడండి : కేంద్రం
తుపాను కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి రాజీవ్‌గాబా సూచించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్‌సీఎంసీ) సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి పరిస్థితులనైనా సమర్ధంగా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని, ఎన్డీఆర్‌ఎఫ్‌ ఇతరత్రా సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నామని మూడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఆయనకు వివరించారు. ఈ నెల 24–26 తేదీల మధ్య ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాలను తుపాను ప్రభావితం చేసే అవకాశం ఉందని భారత వాతావరణ పరిశోధనా సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ వివరించారు.  

మరిన్ని వార్తలు