వాయుగుండంగా బలహీనపడ్డ నివర్

27 Nov, 2020 09:43 IST|Sakshi

ఏపీలో 'నివర్‌' తుపాన్‌ బీభత్సం

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుద్దుచ్చేరి రాష్ట్రాలను అతలాకుతలం చేసిన నివర్ తుఫాన్ క్రమంగా బలహీనపడింది. ప్రస్తుతం తుపాను దక్షిణ రాయలసీమ పరిసరాల్లో కేంద్రీకృతమై, అల్పపీడనంగా మార్పుతున్నట్లు వాతామరణశాఖ తెలిపింది. రాబోయే ఆరు గంటల్లో క్రమంగా మరింత బలహీనపడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, కర్నూలు జిల్లాలో పలుచోట్ల వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూ.గో, ప.గో, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణశాఖ సూచనలు చేసింది. (‘నివర్‌’ బీభత్సం)

రైతులను నిలువునా ముంచిన 'నివర్‌'
కృష్ణా జిల్లా రైతులను నివర్‌ తుఫాన్‌ నిలువునా ముంచింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో వరి, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 27 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్టు అధికారుల ప్రాథమిక అంచనా. పంట చేతికందే సమయంలో దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యం రంగుమారి గిట్టుబాటు ధర రాదనే ఆవేదనను రైతులు వ్యక్తం చేస్తున్నారు. తుఫాను ప్రభావం ఇలాగే కొనసాగితే వరి కంకులకు మొలకలు వస్తాయని రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది.

నెల్లూరు జిల్లాలో కుంభవృష్టి
నివర్‌ తుఫాన్ దెబ్బకు నెల్లూరు జిల్లాలో కుంభవృష్టి కురిసింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు తీవ్రంగా దెబ్బతినడంతో చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. సోమశిలకు వరద నీరు పోటెత్తడంతో సోమశిల నుండి భారీగా దిగువకు నీటిని విడుదల చేశారు. సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో పెన్నా నది ఉగ్రరూపం దాల్చింది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

►గూడూరు ఆదిశంకర కాలేజి వద్ద ఎన్‌హెచ్‌ 16పై కాలువ ఉదృతంగా ప్రవహిస్తోంది. నెల్లూరు నుండి గూడూరు వైపు వాహనాల రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో హైవే పై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రాత్రి నుంచి పోలీసులు పహారా కాస్తున్నారు. వరద తగ్గేవరకు ఆ మార్గం గుండా రాకపోకలను పోలీసులు నిలిపివేస్తున్నారు.  

చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌ హరికిరణ్‌
నివర్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కడపలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. దీంతో నగరంలోని బుగ్గవంక పరివాహ ప్రాంతాల్లో భారీగా వర్షపునీరు చేరిన వీధులను జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ గురువారం రాత్రి పరిశీలించారు. జేసీ సాయికాంత్ వర్మ, సబ్ కలెక్టర్ పృధ్వీతేజ్‌లతో కలిసి వర్షపునీరు చేరిన ప్రాంతాల్లో ప్రజలను ప్రత్యక్షంగా కలిసిన కలెక్టర్‌ వారిని అప్రమత్తం చేశారు. నగరంలోని నాగరాజుపేట, చెమ్ముమియా పేట పరిధిలోని హరి టవర్స్, పాత బస్టాండు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతల్లోకి వెళ్లిన కలెక్టర్‌.. ప్రజలను దగ్గరుండి ఇళ్లు ఖాళీ చేయించారు. 

►తూర్పుగోదావరి: తుపాను నేపథ్యంలో వ్యవసాయ అధికారులు రైతులకు సాయం అందించేలా క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని, పంట నష్టం కలగకుండా రైతులకు సూచనలు ఇవ్వాలని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

చిత్తూరులో నివర్‌ తుఫాన్‌ బీభత్సం:
►తుఫాన్‌ ప్రభావం కారణంగా తిరుపతిలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేల కూలాయి. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మల్లెమడుగు రిజర్వాయర్ నుంచి దిగువకు 40వేల క్యూసెక్కులని నీటి విడుదల చేశారు.
►చంద్రగిరి మండలం పులిత్తివారిపల్లి, నాగయ్యగారిపల్లె వద్ద వరద ఉధృతికి చెక్‌ డ్యామ్‌లు  కూలిపోయాయి. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. తుపాను ప్రభావంతో చంద్రగిరి స్వర్ణముఖి నదిలో వరద ఉధృతి పెరిగింది.

తిరుమలలో నివర్ తుపాను ఎఫెక్ట్‌
భారీ వర్షాలకు జలాశయాలు నిండు కుండలా మారాయి. దీంతో అన్ని జలాశయాల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్నాయి. శ్రీవారి మెట్టు నడకదారిని అధికారులు మూసివేశారు. భారీ వర్షంతో అనేక ప్రాంతాల్లో వృక్షాలు నేలకూలాయి.

కర్నూలులో ఎడతెరిపిలేని వర్షాలు
నివర్ తుపాను కారణంగా జిల్లాలోని బనగానపల్లె నియోజకవర్గంలో బనగానపల్లె, కోవెలకుంట్ల, అవుకు, సంజామల, కొలిమిగుండ్ల మండలాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా