బల్క్‌డ్రగ్‌ పార్కుపై దుష్టచతుష్టయం కుట్ర

11 Sep, 2022 05:29 IST|Sakshi

సీఎం జగన్‌ కేంద్రంతో పోరాడి ఈ ప్రాజెక్టు సాధించారు

మత్స్యకారుల మనుగడకు ఇబ్బంది ఉండదు

కలుషిత నీటిని శుద్ధిచేసి సముద్రంలో వదిలే ఏర్పాట్లు చేశారు

కోనసీమ అభివృద్ధికి సీఎం బాటలు వేశారు

అభివృద్ధిని అడ్డుకోవడమే చంద్రబాబు అండ్‌ కో లక్ష్యం

రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా

తుని: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి సాధించిన బల్క్‌ డ్రగ్‌ పార్కును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు, దుష్టచతుష్టయం కుట్ర పన్నుతున్నాయని, అందులో భాగంగానే రకరకాల లేఖలు రాస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు అండ్‌ కో.. పని చేస్తోందని దుయ్యబట్టారు. ఆయన శనివారం తునిలో విలేకరులతో మాట్లాడారు. పెరుమాళ్లపురం–కోదాడ మధ్య బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటు విషయంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారని చెప్పారు.

మత్స్యకారులకు, హేచరీలకు ఇబ్బంది లేకుండా ఉన్నతస్థాయిలో పరిశీలన, పరీక్షలు చేశారని, కలుషిత నీటిని శుద్ధి చేసి 53 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో వదిలే ఏర్పాట్లు చేశారని వివరించారు. కోనసీమలో అభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు. ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు అందరూ సీఎంను అభినందిస్తున్నారని చెప్పారు. విపక్షాలు, దుష్టచతుష్టయం మాత్రం కాలుష్యమంటూ దీనిని అడ్డుకొంటున్నారని అన్నారు.

కాకినాడ జిల్లా తొండంగి మండలంలో టీడీపీ ప్రభుత్వం దివీస్‌ మందుల పరిశ్రమకు అనుమతులు ఇచ్చినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా... అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడును ప్రశ్నించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్‌ మార్కెట్, మట్కా, పేకాట, వైట్‌కాలర్‌ మోసగాళ్లు ఏ మేర ప్రజలను మోసం చేశారో.. దుష్టచతుష్టయమైన చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి అంతకు మించి ప్రజల సంపదను దోచుకున్నారని ఆరోపించారు.

ఒకరు కిరసనాయిల్, మరొకరు పచ్చళ్లు, ఇంకొకరు హెయిర్‌ ఆయిల్‌ వ్యాపారం పేరుతో లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి దోచుకున్నారన్నారు. దుష్టచతుష్టయం బారి నుంచి కేసీఆర్‌ తెలంగాణను రక్షించుకున్నారని, ఇప్పుడు మన రాష్ట్రంపై హైదరాబాద్‌లో ఉండి బురద జల్లుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మాత్రమే సీఎంగా ఉండాలన్నది వీరి కుటిల నీతి అని అన్నారు.

కరోనా తర్వాత దేశంలో అత్యధిక జీడీపీ సాధించిన రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉందని మంత్రి గుర్తు చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని, అయితే అదంతా తానే చేశానని చంద్రబాబు అనడం.. దానిని ఎల్లో మీడియా వండి వార్చడం పరిపాటిగా మారిందన్నారు. ప్రజల ముందుకు వచ్చి యాత్ర చేస్తే గుణపాఠం చెబుతారని చెప్పారు. అమరావతి 26 గ్రామాలకే సంపదను కట్టబెట్టి, మిగిలిన రాష్ట్రంలోని ప్రజలను బిచ్చగాళ్లను చేయాలని చూశారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. 

మరిన్ని వార్తలు