ఫేక్‌ పోస్టును షేర్‌ చేసిన పురందేశ్వరి 

6 Oct, 2021 08:04 IST|Sakshi

వాస్తవాలు నిర్ధారించుకోకుండానే ట్విట్టర్‌లో పోస్టు

సాక్షి, అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి ఫేక్‌ పోస్టును షేర్‌ చేసి చిక్కుల్లో పడ్డారు. వివరాల్లోకెళ్తే.. ఒక ఆటో వెనుక అంటించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రం నుంచి బూడిద రాలుతోందని, ఇది జగన్‌ మహిమే అంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన సోషల్‌ మీడియా కార్యకర్తలు ఒక ఫేక్‌ పోస్టును సృష్టించారు. దీన్ని సాక్షి వెబ్‌సైట్‌ పోస్టు చేసినట్టు సాక్షి లోగో వాడారు. ఇది, నిజమో, కాదో నిర్ధారించకోకుండా పురందేశ్వరి ఆ ఫేక్‌ పోస్టును తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. పైగా ‘వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక మనకు బూడిదే మిగిలింది’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

కానీ ఆటో వెనుక అతికించిన సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రం నుంచి ఎక్కడా బూడిద రాలలేదు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏ అంశం లేకపోవడంతో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ఏకంగా ‘సాక్షి’ వెబ్‌సైట్‌ లోగోతో ఓ ఫేక్‌ పోస్టును సృష్టించారు. సాక్షి వెబ్‌సైట్‌లో అటువంటి వార్తను ప్రచురించనే లేదు. కానీ దగ్గుబాటి పురందేశ్వరి వాస్తవాలు నిర్ధారించుకోకుండానే ఆ ఫేక్‌ పోస్టును తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు.  

కాగా, ఫేక్‌ పోస్టును సృష్టించి.. సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ‘సాక్షి’ డిజిటల్‌ విభాగం హైదరాబాద్‌లోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది. 

మరిన్ని వార్తలు