ఇంటింటికీ కొళాయి.. ప్రతిరోజూ మంచినీళ్లు

4 Nov, 2020 03:33 IST|Sakshi

పట్టణాల్లో మాదిరి గ్రామాల్లోనూ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక

ప్రస్తుతం 389 గ్రామాల్లోనే అన్ని ఇళ్లకు కొళాయి కనెక్షన్లు

వచ్చే నాలుగైదేళ్లలో మొత్తం 17,494 గ్రామాల్లో 100% ఇళ్లకు నీటి కనెక్షన్లు

ఈ ఆర్థిక ఏడాదే 32.01 లక్షల ఇళ్లకు కనెక్షన్లు 

రూ.4,689 కోట్ల ఖర్చు.. ఇందులో కేంద్రం వాటా రూ.790 కోట్లు

సాక్షి, అమరావతి: పట్టణాల తరహాలో గ్రామాల్లో కూడా ప్రతిరోజూ మంచినీటి సరఫరాకు వీలుగా ఇంటింటికీ నీటి కొళాయి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో మొత్తం 17,494 గ్రామాలు  ఉండగా.. ప్రస్తుతం 389 గ్రామాల్లోనే వంద శాతం ఇళ్లకు నీటి కొళాయిలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నాలుగైదేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వంద శాతం ఇళ్లకు నీటి కొళాయి కనెక్షన్లు ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. 

కరోనా సమయంలోనూ 2.85 లక్షల కనెక్షన్లు
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతం మొత్తంలో 95.66 లక్షల ఇళ్లు ఉన్నాయి. అందులో 32.34 లక్షల ఇళ్లకు ఇప్పటికే కొళాయి కనెక్షన్లు ఉండగా.. 63,32,972 ఇళ్లకు కొత్తగా కనెక్షన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కాగా ఈ ఆర్థిక ఏడాది 32,01,417 ఇళ్లకు నీటి కొళాయిలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలోనూ గత ఏడు నెలలుగా 2.85 లక్షల ఇళ్లకు కనెక్షన్లు ఏర్పాటు చేశారు. ఈ ఆర్థిక ఏడాదికి మరో ఐదు నెలల సమయం ఉండటంతో నిర్దేశిత లక్ష్యాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నట్టు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్‌ అధికారులు వెల్లడించారు. 

తొలుత మంచినీటి పథకాలున్న గ్రామాల్లో..
ఇప్పటికే పూర్తి స్థాయిలో మంచినీటి పథకాలు ఉండి, సరఫరాకు తగిన నీటి వనరులు అందుబాటులో ఉన్న గ్రామాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని వంద శాతం నీటి కొళాయి కనెక్షన్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విధంగా తొలిదశలో.. గ్రామంలో ప్రతి వ్యక్తికీ ప్రతిరోజూ 40–55 లీటర్ల మధ్య నీటి సరఫరాకు (ఎల్‌పీసీడీ) వీలుగా మంచినీటి పథకం, నీటి వనరులు ఇప్పటికే అందుబాటులో ఉన్న 6,301 గ్రామాల్లో వంద శాతం కనెక్షన్లు ఏర్పాటుకు పనులు చేపడుతున్నారు. ఈ ఆర్థిక ఏడాదిలో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న 32.01 లక్షల కనెక్షన్లకు గాను వివిధ పథకాల నిధులను అనుసంధానం చేయడం ద్వారా రూ.4,689.98 కోట్లు వ్యయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో తన వాటాగా కేంద్రం రూ.790.48 కోట్లు ఇవ్వనుంది. 

మరిన్ని వార్తలు