యుద్ధప్రాతిపదికన మరమ్మతులు

21 Nov, 2021 03:52 IST|Sakshi

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల: భారీ వర్షాల వల్ల తిరుమలలో దెబ్బతిన్న రోడ్లు, రక్షణ గోడలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపడతామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల, తిరుపతిలో 30 ఏళ్లలో ఏనాడు లేనంత స్థాయిలో ఈ నెల 17వ తేదీ నుంచి 19 వరకు వర్షాలు కురిశాయని పేర్కొన్నారు. వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్‌ డ్యామ్‌లు పొంగి కపిల తీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ముంచెత్తినట్టు ఆయన వెల్లడించారు. వర్షాల వల్ల తిరుమలలో రూ.4 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందన్నారు. మొదటి ఘాట్‌ రోడ్‌లోని అక్కగార్ల గుడి వద్ద రక్షణ గోడ దెబ్బతిందని, ఘాట్‌ రోడ్‌లోని నాలుగు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయని పేర్కొన్నారు.

టీటీడీ సిబ్బంది, అధికారులు యుద్ధ ప్రాతిపదికన వీటిని తొలగించి తాత్కాలిక రక్షణ ఏర్పాట్లతో ట్రాఫిక్‌ను పునరుద్ధరించారని తెలిపారు. రెండవ ఘాట్‌ రోడ్లలో 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడ్డాయని, ఐదు ప్రాంతాల్లో రక్షణ గోడలు దెబ్బతిన్నాయని, తిరుమల నారాయణగిరి గెస్ట్‌ హౌస్‌ను ఆనుకుని ఉన్న రక్షణ గోడ పడిపోవడంతో మూడు గదులు దెబ్బతిన్నాయని వెల్లడించారు. శ్రీవారి మెట్టు మార్గంలో కొంతమేరకు రోడ్డు, ఫుట్‌పాత్‌ దెబ్బతిన్నాయన్నారు.

కపిల తీర్థం ఆలయంలో ఒక మండపం వర్షాలకు దెబ్బతిందని, దీని మరమ్మతులకు రూ.70 లక్షలు ఖర్చు కావచ్చని అధికారులు అంచనా వేశారని తెలిపారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో ఆగిపోయిన భక్తులకు శ్రీనివాసం, మాధవం, రెండు, మూడో సత్రాల్లో వసతి, ఆహారం ఏర్పాటు చేశామని తెలిపారు. టికెట్లు ఉండి దర్శనానికి రాలేకపోయిన భక్తులను వర్షాలు తగ్గాక దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.    
చదవండి: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

మరిన్ని వార్తలు