డెమో కారిడార్లుగా డేంజర్‌ రోడ్లు

4 Jan, 2021 05:16 IST|Sakshi

ప్రతి జిల్లాలో 100 కి.మీ మేర అభివృద్ధి 

రవాణా శాఖ నిర్ణయం .. రోడ్డు భద్రతపై సుప్రీం కమిటీకి నివేదిక

డెమో కారిడార్లతో ప్రమాదాలు తగ్గుతాయని వెల్లడి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రమాదకరంగా ఉన్న రాష్ట్ర రహదారులు ఇకపై డెమో కారిడార్లుగా మారనున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ వంద కిలోమీటర్ల చొప్పున వీటిని ఏర్పాటు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రహదారి భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీకి తాజాగా నివేదిక పంపింది. డెమో కారిడార్లతో ప్రమాదాల శాతం తగ్గుతుందని పేర్కొంది. రేణిగుంట–రాయలచెరువు కారిడార్‌తో సత్ఫలితాలు వచ్చాయని తెలిపింది. దీంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలన్నిటినీ గుర్తించి ఆయా చోట్ల డెమో కారిడార్‌ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపింది. జిల్లాల్లో ఏ రాష్ట్ర రహదారిపై అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయో త్వరలో నివేదికలు ఇవ్వాల్సిందిగా ఆయా జిల్లాల్లో రోడ్డు భద్రతా కమిటీలకు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న కలెక్టర్లను కోరామని వివరించింది. 

మొత్తం 1,300 కి.మీ మేర
► 13 జిల్లాల్లో 1,300 కి.మీ. మేర  రాష్ట్ర రహదారులపై డెమో కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో డెమో కారిడార్‌కు రూ.30 కోట్లకు పైగా వెచ్చించనున్నారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న జిల్లాలకు తొలి ప్రాధాన్యం ఇస్తారు.
► ఇప్పటికే కడప, అనంతపురం జిల్లాల మధ్య 139 కి.మీ మేర రేణిగుంట–రాయలచెరువు డెమో కారిడార్‌ ఉంది. తాజాగా ఇవే జిల్లాల్లో రాజంపేట–రాయచోటి–కదిరి మధ్య మరో డెమో కారిడార్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 
► అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న గుంటూరు జిల్లాలోని కొండమోడు–పేరేచర్ల, కృష్ణా జిల్లాలోని విజయవాడ–పునాదిపాడు, నూజివీడు–పశ్చిమ గోదావరిలోని భీమవరం మధ్య డెమో కారిడార్‌ ప్రతిపాదించారు. 

రూ.2.5 కోట్లతో రోడ్‌ సేఫ్టీ ఆడిట్‌
రాష్ట్రంలో వెయ్యి కిలోమీటర్ల మేర రూ.2.5 కోట్లతో రోడ్‌ సేఫ్టీ ఆడిట్‌ (రోడ్డు భద్రత పరిశీలన)ను ప్రారంభించినట్లు రవాణా శాఖ తెలిపింది. ఇకపై కొత్తగా 5 కి.మీ. రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నా..రోడ్‌ సేఫ్టీ ఆడిట్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు వివరించింది. రాష్ట్రంలో ఇప్పటికే రూ.25 కోట్ల విలువైన బ్లాక్‌స్పాట్‌ (ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతం)ల మెరుగుదల పనులు జరిగాయని, మరో రూ.50 కోట్ల పనులు కొనసాగుతున్నట్లు వివరించింది. అలాగే రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, మోటారు వాహన చట్టం అమలు, ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు విధిస్తున్న జరిమానాలు తదితర వివరాలతో సమగ్ర నివేదికను పంపింది.

రేణిగుంట–రాయలచెరువు కారిడార్‌తో సత్ఫలితాలు
► 2012లో రేణిగుంట–రాయలచెరువు మధ్య డెమో కారిడార్‌ ఏర్పాటు చేసేందుకు ప్రపంచ బ్యాంకు రూ.36 కోట్లు అందజేసింది.
► 2013లో ఈ రహదారిలో 250 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా.. కారిడార్‌ ఏర్పాటు తర్వాత ప్రమాదాలు క్రమంగా తగ్గుతున్నాయి. 2015 నాటికి సగానికి తగ్గగా, 2017 నాటికి వంద వరకు నమోదయ్యాయి. ఇక 2018 నాటికి పదుల సంఖ్యలోనే ప్రమాదాలు నమోదు కావడం గమనార్హం. 

డెమో కారిడార్‌ అంటే...
డెమో కారిడార్‌ అంటే ప్రమాదాలకు అంతగా అవకాశం లేనిరోడ్డు. డెమో కారిడార్‌ కింద తొలుత ఆ రహదారిని మలుపులు లేకుండా నిర్మిస్తారు. ఎక్కడికక్కడ సైన్‌ బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఎక్కడా గుంతలు లేకుండా చూస్తారు. నిర్దేశిత బరువున్న వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. వాహనాల బరువును చూసేందుకు ఆయా రోడ్లలో వే బ్రిడ్జిలు (కాటా యంత్రాలు) ఏర్పాటు చేస్తారు. ప్రమాదం జరిగితే వెంటనే ఆస్పత్రికి చేర్చేలా అంబులెన్స్‌లు కూడా అందుబాటులో ఉంచుతారు. 

మరిన్ని వార్తలు