సంక్షేమాభివృద్ధే గెలుపునకు సోపానం 

1 Oct, 2021 02:43 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ బద్వేలు అభ్యర్థి డాక్టర్‌ దాసరి సుధ 

సీఎం సూచన మేరకే రాజకీయాల్లోకి వచ్చా.. నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు 

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తన గెలుపును సునాయాసం చేస్తాయని వైఎస్సార్‌ జిల్లా బద్వేలు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ దాసరి సుధ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తను ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం ఆమె సీఎం జగన్‌తో సమావేశమైన అనంతరం  మీడియా పాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు. తన భర్త, ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య చనిపోయినప్పుడు పరామర్శ కోసం వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌.. తన కుటుంబ సభ్యులను ఓదార్చటమే కాకుండా, కుటుంబానికి అండగా ఉండి ఆదుకుంటానని చెప్పారన్నారు. ఆ సందర్భంలోనే.. డాక్టర్‌గా చాలా కాలంగా ప్రజా సేవ చేస్తున్నారు కాబట్టి, ఇష్టమైతే రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మరింత దగ్గరగా సేవ చేయొచ్చని సూచించారన్నారు.

అలా ప్రజల్లో ఉంటే భర్తలేరన్న బాధ నుంచి ఉపశమనం కలుగుతుందని తెలియజేశారని చెప్పారు. సీఎం జగన్‌ ఓదార్పు తమ కుటుంబ సభ్యులను ఎంతో ఆకట్టుకుందని తెలిపారు. ఆయన సారథ్యంలో బద్వేలు సమాగ్రాభివృద్ధి కోసం అహర్నిశలు పని చేస్తానని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, పార్టీ నేతలు, కార్యకర్తలందరి సంపూర్ణ సహకారం తనకు ఉందని తెలిపారు. వైఎస్‌ జగన్‌ పాలన కారణంగా బద్వేలు ప్రజలు ఈ ఉప ఎన్నికలో తనకు మంచి మెజార్టీ కట్టబెడతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఎప్పటికీ జగన్‌ కుటుంబం వెంటే నడుస్తానని చెప్పారు. కాగా, అంతకు ముందు ఆమె.. తనను బద్వేలు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం జగన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. 

గతంలో కంటే ఎక్కువ మెజార్టీ తథ్యం
వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో బద్వేలులో గతంలో కంటే ఎక్కువ మెజార్టీ సాధిస్తామని మాజీ ఎమ్మెల్సీ దేవసాని చిన్న గోవిందరెడ్డి అన్నారు. ప్రజా ప్రతినిధుల సమక్షంలో డాక్టర్‌ దాసరి సుధను సీఎం జగన్‌ అభ్యర్థిగా ప్రకటించారన్నారు. ఎన్నికల వ్యూహంపై సీఎం తమకు దిశా నిర్దేశం చేశారని చెప్పారు. సుధ గెలుపు కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని తెలిపారు. గత 4 ఎన్నికల్లో వైఎస్సార్‌ కుటుంబానికి బద్వేలు నియోజకవర్గం మద్దతుగా నిలిచిందని చెప్పారు. సీఎం జగన్‌పై, వైఎస్సార్‌సీపీ మీద ప్రజలకు కొండంత విశ్వాసం ఉందని, అందుకే భారీ మెజార్టీతో గెలుపు తథ్యం అన్న నమ్మకం తమకు ఉందని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్, పార్టీ నేతలు కరెంట్‌ రమణారెడ్డి, రొండా మాధవరెడ్డి పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు