అమ్మ రుణం ఇలా తీర్చుకున్నారు!

19 Mar, 2022 11:55 IST|Sakshi
తల్లి పాడె మోస్తున్న కుమార్తెలు  

మచిలీపట్నం: నవ మాసాలు కని పెంచిన తల్లి రుణాన్ని కుమార్తెలు ఇలా తీర్చుకున్నారు. మరణించిన తల్లి భౌతికకాయాన్ని ఉంచిన పాడెను శ్మశానం వరకు మోసి అంత్యక్రియలు సైతం నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని మాచవరం కాలనీకి చెందిన కె.విజయలక్ష్మి అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతిచెందారు. ఆమె భర్త సుబ్రహ్మణ్యం మూడేళ్ల కిందటే మరణించారు. సుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి దంపతులకు మగబిడ్డలు లేరు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లి చేసి పంపించారు.

చదవండి: డప్పు రమేష్‌ కన్నుమూత

శుక్రవారం తల్లి మృతి వార్త తెలియగానే కుమార్తెలు ముగ్గురూ వచ్చారు. అల్లారు ముద్దుగా పెంచిన అమ్మ దూరమైపోయిందని భోరున విలపిస్తూనే నెరవేర్చవలసిన అంతిమ సంస్కార కార్యక్రమాలన్నీ తామే నిర్వహించారు. ముగ్గురు కుమార్తెలు, తమ భర్తలతో పాటు తామూ పాడె మోసి శ్మశానం వరకు వెళ్లడమే కాకుండా అంత్యక్రియలు సైతం నిర్వహించారు. అమ్మ రుణం ఇలా తీర్చుకున్నారంటూ డివిజన్‌ కార్పొరేటర్‌ పరింకాయల విజయ్, కాలనీ వాసులు వారిని ప్రశంసించారు.

మరిన్ని వార్తలు