తండ్రి రుణం తీర్చుకున్న కుమార్తెలు

25 Nov, 2021 11:43 IST|Sakshi

సాక్షి,ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): సంప్రదాయాన్ని.. సమాజ కట్టుబాట్లను పక్కనపెట్టి కన్న తండ్రి రుణం తీర్చుకున్నారు ఇద్దరు కూతుళ్లు. కని పెంచడమే కాదు.. విద్యాబుద్ధులు చెప్పించి సమాజంలో ఉన్నతంగా నిలిపిన నాన్నకు కొడుకు లేని లోటు తీర్చారు. ఆ తండ్రి మృతి చెందిన వేళ.. అన్నీ వారై పాడెమోసి.. చితికి నిప్పంటించారు. ఆధునిక సమాజంలో మగ బిడ్డలకు ఆడబిడ్డలు ఏమాత్రం తీసిపోరని నిరూపించారు.

ఎంవీపీ కాలనీ సెక్టార్‌ – 2కి చెందిన ఉజ్జి గణపతి అనారోగ్యంతో మంగళవారం మరణించారు. ఆయనకు రిపుపర్ణ, ఉపాసన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన తొలి నుంచి కుమార్తెలను ఆదర్శవంతంగా పెంచారు. విద్యాబుద్ధులతోపాటు మంచి ఉద్యోగాల్లో స్థిరపడేలా ప్రోత్సహించారు. దీంతో రిపుపర్ణ ప్రస్తుతం హెచ్‌ఎస్‌బీసీలో ఉద్యోగం చేస్తుండగా, ఉపాసన హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో అనారోగ్యంతో మరణించిన  తండ్రికి కొడుకు లేని లోటు తీర్చాలని వారు భావించారు.

తండ్రి అంత్యక్రియాల్లో సంప్రదాయం ప్రకారం కొడుకు నిర్వర్తించాల్సిన అన్ని కార్యక్రమాలను వారే పూర్తిచేశారు. బంధుమిత్రులతో కలిసి ఇంటి నుంచి సెక్టార్‌ – 11లోని బరెల్‌గ్రౌండ్‌ వరకు తండ్రి పాడె మోసుకొచ్చారు. అనంతరం తండ్రి చితికి నిప్పంటించి రుణం తీర్చుకున్నారు. నాన్న రుణం తీర్చుకొనేందుకు ఆ ఇద్దరు ఆడపిల్లలు స్ఫూర్తిదాయకంగా వ్యవహరించిన తీరు చూపరులను ఆకట్టుకుంది.

చదవండి: లోపల ఊపిరి ఆడట్లేదు.. మమ్మల్ని బతకనివ్వండి ప్లీజ్‌

మరిన్ని వార్తలు