తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన కుమార్తెలు

13 Dec, 2022 08:01 IST|Sakshi

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: అప్పులు బాధ తట్టుకోలేక శంకుల బాలసుబ్రహ్మణ్యంరెడ్డి (46) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి అంత్యక్రియలను కుమార్తెలు సోమవారం నిర్వహించారు. ఈ ఘటన మండలంలోని చౌకచెర్ల గ్రామంలో జరిగింది. స్థానికులు, కుటుంబసభ్యుల కథనం మేరకు.. విడవలూరు మండలం చౌకచెర్ల గ్రామానికి చెందిన శంకుల బాలసుబ్రహ్మణ్యంరెడ్డి చిన్నపాటి కాంట్రాక్ట్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆయనకు భార్య శారద, కుమార్తెలు తేజ, లిఖిత ఉన్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు తరలివెళ్లారు. 

అక్కడ ఓ సంస్థలో సబ్‌ కాంట్రాక్టర్‌గా ఆయన పని చేసేవాడు. ఇందులో భాగంగా నాగాలాండ్‌లో ఒక పనిని సుమారు రూ.12 కోట్లు అప్పు చేసి పూర్తి చేశాడు. అయితే ఈ పని నిమిత్తం సదరు సంస్థ వారు రూ.4.03 కోట్లను చెల్లించగా, మిగిలిన మొత్తాన్ని ఇవ్వలేదు. తనకు రావాల్సిన డబ్బును ఇవ్వాలని సంస్థను బాలసుబ్రహ్మణ్యంరెడ్డి కోరగా కాలయాపన చేశారు. సెపె్టంబర్‌ నెలలో నాగాలాండ్‌ నుంచి హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చిన అతడిపై అప్పు ఇచ్చిన వారి ఒత్తిళ్లు అధికమయ్యాయి. 

దీంతో అదే నెలలో తిరిగి నాగాలాండ్‌కు వెళ్లిపోయాడు. అయితే సెప్టెంబర్‌ 29వ తేదీన చివరిగా తన భర్త నుంచి ఫోన్‌ వచ్చిందని శారద చెబుతున్నారు. ఈనెల 8వ తేదీన బాలసుబ్రహ్మణ్యంరెడ్డి తను ఉంటున్న గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడని హైదరాబాద్‌ పోలీసులు ఆయన కుటుంబసభ్యులకు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాసిన సూసైడ్‌ నోట్‌ అక్కడ లభించింది. అందులో ఆ సంస్థ చేస్తున్న అక్రమాలను వివరించాడు. ఆత్మహత్యకు వారే కారణమని బాలసుబ్రహ్మణ్యంరెడ్డి రాశాడు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు.

తలకొరివి పెట్టిన కుమార్తెలు 
తండ్రి మరణ వార్తను విని కుమార్తెలు తేజ, లిఖిత జీరి్ణంచుకోలేకపోయారు. ఆదివారం ఉదయం చెన్నై ఎయిర్‌పోర్టులో బాలసుబ్రహ్మణ్యంరెడ్డి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. రాత్రి స్వగ్రామమైన చౌకచెర్లకు తీసుకొచ్చారు. సోమవారం ఉదయం అంత్యక్రియలను నిర్వహించారు. కుమార్తెలు తండ్రికి తలకొరివి పెట్టారు.  

మరిన్ని వార్తలు