‘ఉపాధి’ కూలి పెంపు 

31 Mar, 2022 04:32 IST|Sakshi

ఏప్రిల్‌ ఒకటి నుంచి గరిష్టంగా రూ. 257 

ప్రస్తుతం కంటే రూ.12 పెంపు

గత మూడేళ్లలో భారీగా పెరిగిన వేతనం

సాక్షి, అమరావతి: ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి ఉపాధి కూలీలకు గరిష్టంగా చెలిస్తున్న రోజు వారీ కూలి రూ. 245 నుంచి రూ.257కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ప్రస్తుతమిస్తున్న కూలి కంటే రూ.12 అదనంగా పెరిగింది. కేంద్రం ప్రతి ఏటా రాష్ట్రాల వారీగా ఉపాధి హామీ పథకం కూలీలకు చెల్లించే రోజు వారీ కూలిరేటు వివరాలు ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు మార్చి నెల చివరి వారంలో ప్రకటించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ పథకం ఏర్పాటు నుంచి రాష్ట్రానికొకరకమైన రేటును కేంద్రం అందజేస్తుంది.

ఇందుకనుగుణంగా ఏప్రిల్‌ ఒకటినుంచి ప్రారంభమయ్యే 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల వారీగా  ఉపాధి కూలీలకు చెల్లించే కొత్త రోజువారీ వేతనాల రేటు వివరాలతో కేంద్రం తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మన రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ కూలీలకు ఏప్రిల్‌ నుంచి గరిష్టంగా రోజు వారీ కూలి రూ. 257లకు పెంచగా.. తమిళనాడులో రూ. 281, కర్ణాటకలో రూ. 309 చొప్పున కేంద్రం నిర్ణయించింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో రూ.213, పశ్చిమ బెంగాల్‌లో రూ. 223, మధ్యప్రదేశ్‌లో రూ. 204, మహారాష్ట్రలో రూ. 256కు రోజు వారీ వేతనాన్ని పెంచింది.  

మరిన్ని వార్తలు