శీకాయతో సిరులు 

17 Apr, 2022 18:32 IST|Sakshi

విదేశాల్లో మార్కెటింగ్‌కు జీసీసీ కసరత్తు

ఉత్పత్తులను పరిశీలించనున్న ఐఎంవో బృందం

‘ఆర్గానిక్‌’ ధ్రువీకరణ జారీ అయిన వెంటనే   ఎగుమతులు

గిరిజనుకు రెట్టింపు ధరతో  ఆర్థిక ప్రయోజనం చేకూరే అవకాశం

మన్యంలో అటవీ ఉత్పత్తులకు మంచి ధర లభించే రోజులు వచ్చాయి.  వీటిలో ప్రధానంగా గిరిజనులు సేకరిస్తున్న శీకాయను విదేశాల్లో మార్కెటింగ్‌ చేసేందుకు గిరిజన సహకార సంస్థ కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే ఏటా శీకాయ విక్రయం ద్వారా సుమారు రూ.50 లక్షల మేర వ్యాపారం చేస్తున్న జీసీసీ.. తలపెట్టిన విదేశీ మార్కెటింగ్‌ కార్యరూపం దాల్చితే అధిక ఆదాయం ఆర్జించడమే కాకుండా గిరిజనులకు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది.

రంపచోడవరం: మన్యంలో గిరిజనులు సేకరిస్తున్న శీకాయ కాసులు కురిపించనుంది. అడవుల్లో పెరిగే ఈ మొక్కలకు గిరిజనుల ఎటువంటి పురుగు మందులు, ఎరువులు వినియోగించరు. సహజసిద్ధంగా పెరగడం వల్ల  శీకాయకు సేంద్రియ ఉత్పత్తిగా మంచి డిమాండ్‌ ఉంది. దీనికి విదేశాల్లో మంచి మార్కెటింగ్‌ ఉన్నందున ఈ దిశగా గిరిజన సహకార సంస్థ కసరత్తు మొదలు పెట్టింది. గిరిజనులు సేకరించే శీకాయ సేంద్రియ ఉత్పత్తిగా ధ్రువీకరించేందుకు బెంగళూరు ఇంటర్నేషనల్‌ మారిటైమ్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎంవో) బృందం ఈ నెల మారేడుమిల్లి రానుంది.  

బృందం సభ్యులు ధ్రువీకరణతో.. 
ఏజెన్సీలో మారేడుమిల్లి, వై.రామవరం, రంపచోడవరం, రాజవొమ్మంగి, నెల్లిపాక అటవీ ప్రాంతాల్లో గిరిజనులు శీకాయను సేకరిస్తుంటారు. మారేడుమిల్లి రానున్న ఐఎంవో బృందం సభ్యులు మండలంలో శీకాయ విరివిగా లభించే బొడ్లంక, పాతకోట ప్రాంతాలను ఈనెల 20న సందర్శిస్తారు. గిరిజనులు సేకరిస్తున్న శీకాయను పరిశీలిస్తారు. ఎటువంటి పురుగు మందులు, ఎరువులు వినియోగించలేనట్టుగా నిర్థారణ అయిన వెంటనే ధ్రువపత్రం జారీ చేస్తారు.

దీని ఆధారంగా  హైదరాబాద్‌కు చెందిన వెంచూరియా కంపెనీ ద్వారా శీకాయను ప్రోసెసెంగ్‌ చేసి విదేశాలకు మార్కెటింగ్‌ ప్రారంభిస్తామని జీసీసీ అధికారవర్గాలు తెలిపాయి. 

రెట్టింపు ధరకు అవకాశం

ప్రస్తుతం గిరిజనులు సేకరిస్తున్న శీకాయకు గిరిజన సహకార సంస్థ కిలోకు రూ. 55 చెల్లిస్తోంది. సేంద్రియ శీకాయగా ధ్రువీకరణ అనంతరం గిరిజనులకు జీసీసీ రెట్టింపు ధర చెల్లించే అవకాశం ఉంది. శీకాయను విదేశాలకు మార్కెట్‌ చేయడం ద్వారా సేకరించిన గిరిజనులకు 35 శాతం, మార్కెటింగ్‌ చేయడం వల్ల 15 శాతం లాభాలు వస్తాయని జీసీసీ అంచనా వేస్తోంది.  

ఏటా వంద టన్నుల సేకరణ.. 
ఏటా గిరిజన సహకార సంస్థ ఏజెన్సీలో గిరిజనుల  నుంచి 100 టన్నుల శీకాకాయను సేకరిస్తోంది. ఐఎంవో గుర్తింపు తరువాత విదేశాల్లో మార్కెటింగ్‌ చేసేందుకు ఆర్గానిక్‌ శీకాయను గింజలు తొలగించి ఫౌడర్‌గా తయారు చేయాల్సి ఉంటుంది.  

కుంకుడుకు పెరిగిన ధర 
గిరిజనులు సేకరించే కుంకుడు ధరను పెంచుతూ గిరిజన సహకార సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కిలోకు రూ. 35 చెల్లిస్తే ఇక నుంచి రూ. 45 చెల్లించనున్నట్టు ప్రకటించింది. జీసీసీ రిటైల్‌ మార్కెట్‌లో కుంకుడు కాయ పౌడర్, షాంపులకు మంచి డిమాండ్‌ ఉంది. దీంతో ఏటా 150 టన్నుల వరకు కుంకుడు కాయలను గిరిజనుల నుంచి జీసీసీ సేకరిస్తోంది. పచోడవరంలోనే జీసీసీ ఆధ్వర్యంలో కుంకుడు కాయ పౌడరు తయారు చేస్తున్నారు. జీసీసీ సూపర్‌ మార్కెట్లు, జీసీసీ అవుట్‌ లెట్‌ ద్వారా విక్రయిస్తున్నారు. 

ఇతర అటవీ ఉత్పత్తులకు.. 
గిరిజనులు సేకరించే కోవెల జిగురు మొదటి రకం కేజీకి రూ. 200 చొప్పున గిరిజన సహకార సంస్థ చెల్లిస్తోంది. ఉసిరిపప్పునకు కేజీకి రూ. 60, పిక్కతీసిన చింతపండుకు రూ. 63, తేనెకు  రూ. 170, కొండచీపుర్లు కట్టకు రూ.55 చొప్పున చెల్లిస్తోంది.  

గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం

గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఈ ఏడాది శీకాయను విదేశాలకు మార్కెట్‌ చేయడం ద్వారా గిరిజనులకు అధిక రేట్లు లభిస్తాయి. అగ్రిమెంట్‌ దశలో ఉంది. త్వరలో పూర్తవుతుంది. ప్రస్తుతం కోల్డ్‌ స్టోరేజీలో వంద టన్నుల వరకు ఉంది. పిక్క తీయని చింతపండును కొనుగోలు చేయడం వల్ల మార్కెటింగ్‌ ఇబ్బందిగా ఉంది.  
–జె.యూస్టస్, జీసీసీ డీఎం, రంపచోడవరం

మరిన్ని వార్తలు