ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు మార్చి 31 వరకు గడువు

22 Dec, 2021 04:03 IST|Sakshi

ఆలోగా క్రమబద్ధీకరించుకోకుంటే రిజిస్ట్రేషన్లు నిలుపుదల 

రిజిస్ట్రేషన్‌ శాఖకు లేఖ రాయనున్న ఏపీ టీసీపీ  

అందిన దరఖాస్తులు 43,754.. అనుమతులు పొందినవి 9,187 

జనవరి చివరి నాటికి పరిశీలన పూర్తి

సాక్షి, అమరావతి:  లేఅవుట్‌ రెగ్యులేషన్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి అవసరమైన పత్రాలు సమర్పించేందుకు ఏపీ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (టీసీపీ) విభాగం వచ్చే ఏడాది మార్చి 31 వరకు గడువునిచ్చింది. పరిశీలన పూర్తయిన దరఖాస్తుదారులు ఆలోగా అడిగిన పత్రాలు, ఫీజు చెల్లించి తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి. గడువులోగా క్రమబద్ధీకరించని ప్లాట్లలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశంలేకపోవడంతో పాటు ఆయా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు కావు. 

ప్రభుత్వ అనుమతి లేని లే అవుట్లలో ప్లాట్లు తీసుకుని, రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో పాటు అక్కడ చేపట్టే నిర్మాణాలకు అనుమతులు రాక ఇబ్బంది పడుతున్న వారు రాష్ట్రంలో వేలల్లో ఉన్నారు. ఇలాంటి వారికి ఊరటనిస్తూ 2019 ఆగస్టు చివరి నాటికి ప్లాట్లు కొన్నవారు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అవకాశం కల్పించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ వచ్చే ఏడాది మార్చి 31లోగా క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తిచేయాలని ఏపీ టీసీపీ యోచిస్తోంది. అందుకు అనుగుణంగా.. అందిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ప్లాట్ల యజమానులకు అవసరమైన పత్రాలు సమర్పించాలని కొందరికి, అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నవారికి ఫీజు చెల్లించాలని అధికారులు సమాచారం పంపుతున్నారు.  

అందిన దరఖాస్తులు 43 వేలు.. 
రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండానే పలు సంస్థలు వేల సంఖ్యలో ప్రైవేటు వెంచర్లు వేశారు. ఇలాంటి వాటిలో 10,883 వెంచర్లు ఎల్‌ఆర్‌ఎస్‌కు అనుకూలమైనవని టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ విభాగం గుర్తించింది. వాటిలో ప్లాట్లు కొన్నవారికి క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. దీంతో వివిధ జిల్లాల నుంచి 43,754 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటిదాకా నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు సమర్పించి, ఫీజు చెల్లించిన 9,187 దరఖాస్తులకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు.

బఫర్‌ జోన్‌లో ఉన్నవి, సరైన పత్రాలు లేని 1,442 అప్లికేషన్లను తిరస్కరించారు. సోమవారం నాటికి మరో 1,363 మందికి ఫైనల్‌ ప్రొసీడింగ్స్‌కు ఫీజు చెల్లించాలని.. అవసరమైన పత్రాలు సమర్పించాలని మరో 3 వేల మందికి అధికారులు సమాచారం పంపించారు. 2,747 దరఖాస్తులను షార్ట్‌ఫాల్‌లో ఉంచారు. కాగా, ఇంకా పరిశీలించాల్సిన దరఖాస్తులు 28 వేలు ఉన్నాయని, జనవరి చివరి నాటికి వాటి స్క్రూటినీ ప్రక్రియ కూడా పూర్తిచేసి దరఖాస్తుదారులకు సమాచారం పంపుతామని ఏపీ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ వేపనగండ్ల రాముడు తెలిపారు.  

అనుమతిలేకుంటే రిజిస్ట్రేషన్లు బంద్‌ 
ఇక ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారు గడువులోగా స్పందించకుంటే ఇబ్బందులు తప్పేట్టులేవు. దరఖాస్తు చేసుకున్నవారు గడువులోగా అడిగిన పత్రాలు సమర్చించాలని, ఫీజు చెల్లించాలని మెసేజ్‌లు అందుకున్నవారు ఆ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని రాముడు సూచించారు. లేకుంటే అలాంటి ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని రిజిస్ట్రేషన్‌ శాఖకు లేఖ రాయనున్నట్లు చెప్పారు. సమాచారం అందుకున్న దరఖాస్తుదారులు గడువులోగా స్పందించాలని ఆయన కోరారు.   

మరిన్ని వార్తలు