పోలీస్‌ కస్టడీకి నారాయణ స్కూల్‌ డీన్‌

20 May, 2022 05:30 IST|Sakshi

చిత్తూరులోని నాలుగో అదనపు మునిసిఫ్‌ మేజిస్ట్రేట్‌ న్యాయస్థానం ఉత్తర్వులు

చిత్తూరు అర్బన్‌: పదో తరగతి ప్రశ్నపత్రం మాల్‌ ప్రాక్టీస్‌ వ్యవహారంలో తిరుపతి ఎయిర్‌బైపాస్‌ రోడ్డులోని నారాయణ పాఠశాల డీన్‌ గంగాధరరావును పోలీస్‌ కస్టడీకి అనుమతిస్తూ చిత్తూరులోని నాలుగో అదనపు మునిసిఫ్‌ మేజిస్ట్రేట్‌ న్యాయస్థానం గురువారం ఉత్తర్వులిచ్చింది. గత నెల పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి కాంపోజిట్‌ తెలుగు ప్రశ్నపత్రం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఘటనలో టీడీపీ మాజీ మంత్రి పొంగూరు నారాయణతో పాటు పోలీసులు 9 మందిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంలో డీన్‌ గంగాధరరావును పోలీస్‌ కస్టడీకి ఇవ్వాలని వన్‌ టౌన్‌ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లోకనాథరెడ్డి వాదనలు వినిపిస్తూ.. నిందితుల్లో గంగాధరరావు నుంచి ఎవరెవరికి ఆర్థిక సాయం అందింది..? కుట్ర ఎలా జరిగింది? ఇతడి కంటే పెద్దల నుంచి ఎలాంటి ఆదేశాలు వెలువడ్డాయి? అనే విషయాలు విచారించాల్సి ఉందని.. ఏడు రోజుల పోలీస్‌ కస్టడీకు అనుమతిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉందన్నారు.

తమ పిటిషనర్‌కు ఈ ఘటనతో సంబంధం లేదని, బెయిల్‌ మంజూరుచేయాలని గంగాధరరావు తరఫు న్యాయవాదులు వాదించారు. ఇద్దరి వాదనలు విన్న మేజిస్ట్రేట్‌ శ్రీనివాస్‌.. నిందితుడిని మూడు రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చారు.   

మరిన్ని వార్తలు