ఆక్సిజన్‌ లీకేజీతో మరణాలు అవాస్తవం

2 May, 2021 04:56 IST|Sakshi
ప్రభుత్వాసుపత్రిలో పరిస్థితిని సమీక్షిస్తున్న కలెక్టర్‌ గంధం చంద్రుడు

అనంతపురం జిల్లా కలెక్టర్‌ చంద్రుడు 

అనంతపురం హాస్పిటల్‌: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఆక్సిజన్‌ లీకేజీ వల్ల ఎటువంటి మరణాలు చోటు చేసుకోలేదని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు స్పష్టం చేశారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మరణించిన వారిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వయసు మళ్లినవారే అధికంగా ఉన్నారని తెలిపారు. దీనిపై కొందరు కావాలనే ఒక వీడియోను రూపొందించి భయాందోళనలు సృష్టించారని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఆక్సిజన్‌ కొరతతో అధిక సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయని కొన్ని టీవీ చానెళ్లలో వార్తలు రావడంతో కలెక్టర్‌ గంధం చంద్రుడు, జాయింట్‌ కలెక్టర్‌ సిరి నిషాంత్‌కుమార్, డీఎఫ్‌వో జగన్నాథ్‌ సింగ్‌ ఆస్పత్రిని సందర్శించారు. 

ఆక్సిజన్‌ సరఫరాలో లోపం లేదు..
అనంతరం కలెక్టర్‌ గంధం చంద్రుడు మాట్లాడుతూ.. ఆస్పత్రిలో ఎక్కడా ఆక్సిజన్‌ సరఫరాలో లోపం లేదన్నారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌కు 20 రోజుల ముందే అధికారుల ద్వారా ప్రతి ఆక్సిజన్‌ పాయింట్‌లో లోపాలు ఏమైనా ఉన్నాయో, లేదో తనిఖీ చేశామన్నారు. అన్ని ఆస్పత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ, విద్యుత్‌ విభాగాల్లో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సంవత్సర కాలంలోనే జిల్లాలోని ఆరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 40 వేల లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. మూతపడ్డ వాటిని కూడా తెరిపించామన్నారు. జిల్లాలో యాక్టివ్‌ కేసులు 9,600 ఉన్నాయని, 0.79 మరణాల రేటు ప్రకారం ఎన్ని మరణాలు జరుగుతాయో చెప్పాలన్నారు. గత 24 గంటల్లో మొత్తం 11 మంది మృతి చెందారని.. అందులో 50 ఏళ్ల లోపు వారు ముగ్గురు మాత్రమే ఉన్నారని తెలిపారు.

మిగతా వారంతా 50 ఏళ్లు దాటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నావారేనన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కేఎస్‌ఎస్‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులతో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ చివరి నిమిషంలో ఇక్కడికి రావడంతో కొందరు మృతి చెందుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ కోవిడ్‌ రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ఎమ్మెల్యే వెంట మేయర్‌ వసీం సలీం తదితరులున్నారు. 

మరిన్ని వార్తలు