కొండయ్యవాగులో గల్లంతైన తండ్రీకూతురు

24 Oct, 2020 12:46 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : బిడ్డల బాగోగుల కోసం ఊరు వదిలి వెళ్లాడు. తనకు తెలిసిన వృత్తినే జీవనాధారంగా ఎంచుకున్నాడు. కడుపున పుట్టిన వారికి ఏ లోటూ రానివ్వకుండా చూసుకున్నాడు. చదువులో రాణిస్తున్న కుమార్తెను చూసి మురిసిపోయాడు. కుటుంబంతో కలిసి పెనుమూరు మండలం కలిగిరి కొండపై జరిగిన బంధువుల వివాహానికి వెళ్లాడు. అక్షింతలు వేసి వధూవరులను ఆశీర్వదించాడు. చినుకులు పడుతున్నా లెక్కచేయకుండా ఓ కారులో ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో కొండయ్యగారిపల్లె వాగు మృత్యువు రూపంలో అడ్డుపడింది. తండ్రీకుమార్తెను ముంచేసింది. వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది. కుటుంబంలో కన్నీటి వరదని మిగిల్చింది. కుమార్తె మృతదేహం నిన్న లభ్యం కాగా, ఇవాళ తండ్రి మృతదేహం లభ్యమైంది.  (వరద నీటిలో తండ్రీకూతుళ్లు గల్లంతు)

పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. పూతలపుట్టు మండలం వడ్డార్లపల్లెకు చెందిన జి.ప్రతాప్‌ (45) కుటుంబం ప్రస్తుతం చిత్తూరులో నివాసముంటోంది. గురువారం రాత్రి భార్య శ్యామల, కుమార్తె సాయి వినీత (15)తో కలిసి పెనుమూరు మండలం కలిగిరికొండపై జరిగిన బంధువుల వివాహానికి హాజరయ్యారు. పెళ్లికి ఎక్కువ మంది రావడంతో భోజనం అయిపోయింది. మద్యం సేవించి వచ్చిన ప్రతాప్‌ పెళ్లిలో బంధువులతో గొడవ పడ్డాడు. అనంతరం భార్య, కుమార్తెతో పాటు గ్రామానికి చెందిన చిన్నబ్బ అలియాస్‌ సుధాకర్, చిత్తూరు టౌన్‌ కాజూరుకు చెందిన డ్రైవర్‌ కిరణ్‌కుమార్‌ ఏపీ 03 బీఏ 4404 నంబరు కారులో చిత్తూరుకు బయలుదేరారు. గురువారం సాయంత్రం పెనుమూరు మండలంలో భారీ వర్షం కురిసింది. కొండయ్యగారివూరు వద్ద రోడ్డుపై వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రాత్రి 12 గంటల సమయంలో వాగు దాటుతుండగా కారు కొట్టుకుపోయింది. వాగులో కారు సుమారు కిలో మీటర్‌ దూరం వరకు వెళ్లి నిలిచింది. డ్రైవర్‌ కిరణ్‌కుమార్‌ కారు ముందు అద్దాలు పగులగొట్టి శ్యామల, చిన్నబ్బ, ప్రతాప్‌ను సురక్షితంగా వాగు నుంచి ఒడ్డుకు చేర్చాడు. సాయి వినీతను కాపాడుతున్న క్రమంలో ఆమె వాగులో కొట్టుకుపోయింది.   (కోడలి ఆత్మహత్యతో మామ బలవన్మరణం)

కుమార్తెను రక్షించేందుకు ప్రతాప్‌ వాగులో దిగాడు. తండ్రి, కూతురు వాగులో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న కొండయ్యగారివూరు గ్రామస్తులు డయిల్‌ 100కు సమాచారం ఇచ్చారు. పాకాల సీఐ ఆశీర్వాదం, ఎస్‌ఐ ప్రవీన్‌కుమార్‌ తమ సిబ్బందితో గురువారం అర్ధరాత్రి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తుల సహకారంతో వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. ఎలాంటి ఆచూకీ లభించక పోవడంతో శుక్రవారం ఉదయం చిత్తూరు డీఎస్పీ ఈశ్వరరెడ్డి, ఆర్డీఓ రేణుక, తహాసీల్దారు చంద్రశేఖర్‌ డ్రోన్‌ కెమెరాతో వాగుతో పాటు కలికిరి పెద్ద చెరువులో గాలించారు. అలాగే తెప్ప, బోటు సాయంతో చెరువులో గాలించారు. శుక్రవారం మధ్యాహ్నం సాయి వినీత మృతదేహం చెరువులో లభ్యమైంది. ప్రతాప్‌ మృతదేహం కోసం శుక్రవారం నుంచి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తూనే ఉన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని పోలిసులతో కలిసి బోటులో ఎక్కి గాలింపు చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రతాప్‌ మృతదేహం దొరకడంతో స్థానికంగా విషాదం నెలకొంది.  (అనుమానించి ఉద్యోగం మాన్పించాడు.. చివరకు!)

మరిన్ని వార్తలు