మూడు నెలల వ్యయానికి.. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ 

27 Mar, 2021 03:41 IST|Sakshi

ఆర్డినెన్స్‌ జారీకి రాష్ట్ర సర్కారు నిర్ణయం

ఆన్‌లైన్‌ సర్క్యులేషన్‌ ద్వారా ఆమోదం తెలిపిన కేబినెట్‌

గవర్నర్‌ ఆమోదానికి ఆర్డినెన్స్‌.. 

అక్కడినుంచి ఆమోదం రాగానే గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ  

సాక్షి, అమరావతి: 2021–22 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల కాలానికి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌‌పై ఆర్డినెన్స్‌ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా 2021–22 ఆర్థిక సంవత్సరానికి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మార్చి నెలలో నిర్వహించడానికి సాధ్యపడని విషయం తెలిసిందే. అదే సమయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ ఇంకా మిగిలిపోయి ఉండడంతోపాటు కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితుల్లో 2021–22 ఆర్థిక సంవత్సరానికి తొలి మూడు నెలలకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు సంబంధించి ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఆ మేరకు ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు అన్ని రంగాలకు వ్యయం చేసేందుకుగాను ఆర్టికల్‌ 213(1) ప్రకారం రాజ్యాంగానికి అనుగుణంగా ఆర్డినెన్స్‌ జారీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆన్‌లైన్‌లో సర్క్యులేషన్‌ ద్వారా కేబినెట్‌ శుక్రవారం ఆర్డినెన్స్‌ను ఆమోదించింది. అనంతరం ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆమోదానికి పంపించారు. గవర్నర్‌ నుంచి ఆమోదం రాగానే గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ కానుంది.

ఏప్రిల్‌ 1వ తేదీతో ప్రారంభం కానున్న 2021–22 ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలలు.. అంటే ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లతోపాటు నవరత్నాల పథకాలకు, ఇతర రంగాలకు అవసరమైన వ్యయానికి ఆర్డినెన్స్‌ ద్వారా ఆమోదం పొందనున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలోనూ కరోనా వైరస్‌ వ్యాప్తితో నెలకొన్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా తొలి మూడు నెలలకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఆర్డినెన్స్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు