పరిస్థితులను బట్టి పరీక్షలపై నిర్ణయం

3 Jun, 2021 05:11 IST|Sakshi

‘ఇంటర్‌’పై కొద్ది రోజులు నిరీక్షించే యోచనలో విద్యాశాఖ

విద్యార్థుల భద్రతతోపాటు భవిష్యత్తు కూడా ముఖ్యమే

రాష్ట్రంలో ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఇప్పటికే పూర్తి చేసిన బోర్డు

థియరీ పరీక్షలకూ ఏర్పాట్లు 

కోవిడ్‌ నేపథ్యంలో వాయిదా

పరిస్థితుల మదింపు అనంతరం కొత్త షెడ్యూల్‌పై నిర్ణయం

ఇంటర్‌ పరీక్షలు నిర్వహించాలని కేంద్రానికి ఇప్పటికే లేఖ 

సాక్షి, అమరావతి: ఆరోగ్య భద్రతతోపాటు విద్యార్థుల భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుని ఇంటర్మీడియెట్‌ పరీక్షలపై పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని విద్యాశాఖ భావిస్తోంది. సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌  (సీబీఎస్‌ఈ) పరిధిలోని 12వ తరగతి పరీక్షలపై కేంద్రం రద్దు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇంటర్‌ పరీక్షలపై చర్చ మొదలైంది. సీబీఎస్‌ఈ పరీక్షలపై ప్రధాని నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆసక్తి ఉన్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ విద్యార్థుల ఆసక్తితోపాటు వారి భవిష్యత్తును కూడా పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని విద్యాశాఖ భావిస్తోంది.

పలుమార్లు సమీక్షలు
టెన్త్, ఇంటర్‌ పరీక్షలపై విద్యాశాఖ పలుమార్లు వివిధ సంఘాలు, ఇతరులతో నిర్వహించిన సమావేశాల్లో ఎక్కువ మంది కరోనా పరిస్థితులు సద్దుమణిగితే పరీక్షల నిర్వహణే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై అధికారులతో పలుదఫాలు సమీక్షలు జరిపారు. గత నెలలో నిర్వహించాల్సిన ఇంటర్‌ పరీక్షలను విద్యార్థులు, సిబ్బంది ఆరోగ్య భద్రత దృష్ట్యా వాయిదా వేయడంతో పాటు జూన్‌ 7 నుంచి జరగాల్సిన టెన్త్‌ పరీక్షలు కూడా వాయిదా వేయాలని ఆదేశించారు. వైరస్‌ తగ్గుముఖం పట్టాక విద్యార్ధుల ఆసక్తిని అనుసరించి పరీక్షలు నిర్వహించేలా కేంద్రం ఒక ఆప్షన్‌ ఇచ్చినందున రాష్ట్రంలో కూడా దీన్ని అనుసరించి కోవిడ్‌ కేసులు తగ్గాక ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌పై నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇంటర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ పరీక్షలను బోర్డు మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 24వతేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రాక్టికల్స్‌కు 3,58,474 మంది విద్యార్థులు హాజరయ్యారు.

కేంద్రానికి రాష్ట్రం లేఖ
సీబీఎస్‌ఈ పరీక్షలపై ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిర్వహించిన సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ రాష్ట్రం అభిప్రాయాలను వివరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కోవిడ్‌ తగ్గుముఖం పట్టాక పరీక్షల నిర్వహణ మంచిదని  పేర్కొన్నారు. దీనిపై లిఖిత పూర్వకంగా లేఖ ద్వారా అభిప్రాయాలను కేంద్రానికి పంపారు. ఇప్పటికే ప్రాక్టికల్స్‌ నిర్వహించామని, థియరీ పరీక్షలకూ అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఫస్టియర్, సెకండియర్‌ విద్యార్థులకు 8 రోజుల్లో పరీక్షలు పూర్తవుతాయని, 5 లేదా ఆరు పేపర్లు మాత్రమే రాసేలా ఏర్పాట్లు చేశామని వివరించారు. కోవిడ్‌ కేసుల కారణంగా పరీక్షలు వాయిదా వేశామని, తదుపరి కొత్త షెడ్యూల్‌ను 15 రోజులు ముందు విద్యార్థులకు తెలియచేస్తామన్నారు.

మూల్యాంకనం, ఫలితాల ప్రకటనకు 40 రోజుల సమయం అవసరమవుతుందన్నారు. 2 నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్‌ కేసులు తగ్గాక ఆగస్టులో 10+2 (ఇంటర్మీడియెట్‌) పరీక్షలు  నిర్వహించవచ్చనే అభిప్రాయంతో ఉన్నట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు వీలుగా సిబ్బంది కోసం అదనంగా వ్యాక్సిన్లను సరఫరా చేయాలని కోరారు. సీబీఎస్‌ఈ బోర్డు తన పరిధిలోని పరీక్షలపై నిర్ణయం తీసుకున్నా రాష్ట్రంలో పరీక్షలపై ఇంటర్‌ బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జూలైలో పరిస్థితులను మదింపు చేసుకొని ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు.  

మరిన్ని వార్తలు