ఆక్వాకు ఉజ్వల భవిత..స్టేక్‌ హోల్డర్స్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు

10 Jan, 2023 08:48 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆక్వా రంగం మరింత పురోభివృద్ధి సాధించేలా, రైతులకు మేలు కలిగేలా స్టేక్‌ హోల్డర్స్‌ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆక్వా డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్‌ చైర్మన్‌ వడ్డి రఘురామ్‌ అధ్యక్షతన సోమవారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఆక్వా రైతులు, రొయ్యల ఎగుమతిదారులు, ఫీడ్‌ ఉత్పత్తిదారులు, హేచరీల నిర్వాహకులు పాల్గొన్నారు. ఇప్పుడున్న ఫీడ్‌ ధర కిలో రూ.2.50 తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.  

ప్రస్తుతం రొయ్య పిల్లను 36 పైసలకు విక్రయిస్తుండగా, ఆరు పైసలు తగ్గించి 30 పైసలు చేశారు. రైతులు నష్టపోకుండా నాణ్యమైన రొయ్య సీడ్‌ ఉత్పత్తికి అత్యంత ఆధునిక లేబొరేటరీలు నిర్వహించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ లేబొరేటరీల ద్వారా రొయ్య సీడ్‌లో యాంటీబయాటిక్స్‌ లేకుండా చూడాలని నిర్ణయించారు. ప్రతి నెలా 1, 11, 21 తేదీల్లో ధరలపై సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. రొయ్యల చెరువుల వద్ద పట్టుబడి జరిగిన తరువాత సాధ్య­మై­నంత త్వరగా రొయ్యలను ఐస్‌లో వేసి తాజాదనం కోల్పోకుండా చూడాలని, ఈ మేరకు రైతుల­కు అవగాహన కల్పించాలని నిర్ణయించారు.

ఆక్వా రంగంలోని అన్ని వర్గాల వారితో వర్కింగ్‌ కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయాలు అమలయ్యేటట్టు చూడా­లని ఏకాభిప్రాయానికి వచ్చారు. తక్కువ సాంద్రత కలిగి 25 నుంచి 60 మధ్య కౌంట్‌ సాధించేలా రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. మెరుగైన ఉత్పాదకత, నాణ్యత కోసం రైతులకు పూర్తి స్థాయిలో సేవలందించే బాధ్యతను మే­త తయారీదారులు తీసుకోవాలని సూచించారు. పెట్టుబడి ధరలను సమీక్షించిన అనంతరమే ఫీడ్‌ ధర ఖరారు చేసేందుకు ఫీడ్‌ తయారీదారులు ఆమోదం తెలిపారు.

విధిగా నెలకోసారి ఆక్వా రైతులు, రొయ్యల ఎగుమతిదారులు, ఫీడ్‌ ఉత్పత్తిదారులు, హేచరీల నిర్వాహకులు అనుకూలమైన ప్రాంతంలో సమావేశమై, సమస్యల సత్వర పరిష్కారానికి చొరవ తీసుకోవాలని నిర్ణయించారు. ఆక్వా సాగు, రవాణా, కొత్త ట్రెండ్‌లు, నోటిఫికేషన్‌లు, ముందస్తు హెచ్చరికలు, దేశీయ మార్కెటింగ్‌ తదితర అంశాలపై రైతులు, ఫీడ్‌ తయారీదారులు, ప్రాసెసింగ్, ఎగుమతిదారులు సమన్వయంతో ముందుకు సాగాలని తీర్మానించారు. ల్యాబ్‌లు ఏర్పాటు, నిర్వహణ విషయంలో హేచరీ యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

(చదవండి: మా ‘విడాకులు’ తెగుతున్నాయి)

మరిన్ని వార్తలు