దుర్గమ్మకు గాజుల మహోత్సవం

7 Nov, 2021 04:15 IST|Sakshi
గాజుల అలంకరణలో కనకదుర్గమ్మ ఉత్సవమూర్తి

2 లక్షల గాజులతో అలంకరణ

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో శనివారం గాజుల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఉత్సవమూర్తిని గాజులతో అలంకరించారు. యమ ద్వితీయను పురస్కరించుకుని ప్రతి ఏటా కార్తీక మాసం రెండో రోజున అమ్మవారి సన్నిధిలో గాజుల మహోత్సవాన్ని నిర్వహిస్తారు. అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఉత్సవమూర్తిని, ఆలయ ప్రాంగణాన్ని రెండు లక్షల గాజులతో అలంకరించారు.

శనివారం అమ్మవారు గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమివ్వగా, ఆది, సోమవారాలు కూడా ఆలయ ప్రాంగణం గాజుల అలంకరణతోనే ఉంటుందని ఆలయ ఈవో భ్రమరాంబ పేర్కొన్నారు. ఉత్సవం ముగిసిన అనంతరం అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తామని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న కార్తీక మాసోత్సవాల్లో మల్లేశ్వరస్వామికి పెద్ద ఎత్తున భక్తులు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో సహస్ర లింగార్చన, దీపార్చన నిర్వహించారు.  

మరిన్ని వార్తలు